న్యూఢిల్లీ : యుక్త వయస్సు వచ్చిన వారికి వివాహంతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉన్నదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం 2005 కింద ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్’(సహజీవనాన్ని)ను శాసన సభ గుర్తించిందని తెలిపింది. చట్ట బద్దమైన వివాహ వయసు కంటే ముందే పెళ్లి చేసుకున్నారని కేరళకు చెందిన ఓ మేజర్ దంపతుల వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. దాంతో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ విన్నపం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వివాహంతో సంబంధం లేకుండా యుక్త వయసుకు వచ్చిన వారు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది.
అప్పీలు వివరాలు...
కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి తుషారా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి వీరిరువురు మేజర్‌లు అయినప్పటికి నందకుమార్‌కు మాత్రం 21 ఏళ్లు నిండలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే వివాహానికి అర్హులు. దీనిని ఆధారంగా చేసుకుని కేరళ హైకోర్టు నందకుమార్, తుషార్ల వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాక తుషార్‌ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
సుప్రీం కోర్టు ఈ అప్పీలును విచారించడానికి జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ అధ్వర్యంలో ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. నందకుమార్, తుషార్ ఇద్దరు హిందూవులే కనుక హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 ప్రకారం వీరి వివాహం చెల్లుబాటు అవుతుందని, అంతేకాక ఇద్దరు మేజర్లు అయిన కారణంగా వారికి కలిసి జీవించే హక్కుందని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ‘లవ్ జీహాద్’గా పేరు గాంచిన వైకోమ్‌కు చెందిన ‘హదియా’ కేసును ఉదహరించింది.
కేరళ వైకోమ్‌కు చెందిన 24 ఏళ్ల హోమియో వైద్య విద్యార్థిని హదియా తాను ప్రేమించిన జహన్‌ను వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారింది. ఈ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఇద్దరు యుక్త వయస్కుల వివాహ విషయంలో కోర్టు జోక్యం చెల్లదని తీర్పునిచ్చిన సంగతిని గుర్తు చేసింది. అందువల్ల నందకుమార్, తుషార్ల వివాహం చెల్లుతుందని, వారిరువురికి కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు నిచ్చింది. నందకుమార్‌కి ఈ నెల 31 నాటికి 21 ఏళ్లు నిండుతాయి.
Comments
Please login to add a commentAdd a comment