బెంగళూరు : ‘‘లవ్ జిహాద్ అనేది ఓ సామాజిక భూతం. దీనిని రూపుమాపేందుకు నిపుణులను సంప్రదించి చట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు, ప్రేమ పేరిట యవతులకు వల వేసే చర్యలను సహించబోమన్నారు. ‘‘లవ్ జిహాద్ కారణంగా ఇటీవల తరచుగా మతమార్పిడులు జరుగుతున్న విషయాల గురించి వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అధికారులతో కూడా దీని గురించి చర్చించా. ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనేది తెలియదు. కానీ కర్ణాటకలో దీన్ని ఆపాలనుకుంటున్నాం. డబు, ప్రేమ పేరుతో మతం మార్చడమనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం’’ అని ఆయన అన్నారు.
కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా లవ్ జిహాదీ అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో లవ్ జిహాద్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి కంటే ముందు మీడియాతో మాట్లాడిన హోం మంత్రి బసవరాజ్ బొమ్మాయ్.. లవ్ జిహాద్ అనేది ఓ దుష్టశక్తి అని.. ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: లవ్ జిహాద్: హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు)
అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి?
ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయి, హిందూ యువతిని ప్రేమించడం, పెళ్లి చేసుకున్న సందర్భాలను లవ్ జిహాద్‌గా పేర్కొంటూ రైట్ వింగ్ గ్రూపులు వాడుకలోకి తెచ్చాయి. అయితే లవ్ జిహాద్ అనే పదానికి కేంద్ర ఇంతవరకు ఎలాంటి నిర్వచనం చెప్పలేదు. ఈ మేరకు ఫిబ్రవరిలో కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటులో మాట్లాడుతూ.. లవ్ జిహాద్ అనే పదానికి ఎలాంటి చట్ట పరమైన నిర్వచనం లేదన్నారు. ఇప్పటి వరకు దీనిపై కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజల మధ్య విభేదాలు లేకుండా స్వేచ్ఛగా ఏ మతానైనా స్వీకరించడానికి వీలుకల్పిస్తుంది. కానీ లవ్ జిహాద్ గురించి ఎక్కడా లేదని లోక్‌సభలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment