
బెంగళూరు: కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్సెన్స్‌కు బి.ఎస్.యడియూరప్ప (78) తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ గహ్లోత్‌కు సమర్పించారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని పేర్కొన్నారు. యడియురప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ మొదలయ్యింది. బీజేపీ అధిష్టానం కొత్త సీఎంపై ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం గమనార్హం. యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. యడియూరప్ప మంత్రివర్గాన్ని గవర్నర్ రద్దు చేశారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారని పేర్కొంది. గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు.
సీఎం పదవి నుంచి తప్పుకోవాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, నాయకులకు, సహకరించిన అధికారులకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని, స్వచ్ఛందంగానే తప్పుకున్నానని, సీఎంగా ప్రజలకు సేవ చేసేందుకు ఇతరులకు మార్గం సుగమం చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. యడియూరప్ప ఏం చెప్పారంటే.. ‘ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా పూర్తిగా సహకరిస్తా. రాజీయాల్లో కొనసాగుతా. పార్టీ అండతోనే పైకి ఎదిగా. నాకు దక్కినన్ని అవకాశాలు బహుశా మరో నాయకుడికి లభించి ఉండకపోవచ్చు.
పదవులు ఇచ్చినా స్వీకరించను
గవర్నర్ పదవి స్వీకరించాలన్న ఉద్దేశం లేదు. వాజ్‌పేయి నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారు. వద్దని చెప్పా. కర్ణాటకలో బీజేపీ పటిష్టత కోసం పనిచేస్తా’అని యడియూరప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) నుంచి ఫిరాయించి, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేల(ప్రస్తుత మంత్రులు) భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించగా.. తమతోనే కలిసి ఉంటారని స్పష్టం చేశారు.
విధాన సౌధాలో భావోద్వేగంతో కంటతడి
తన ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం విధాన సౌధాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యడియూరప్ప ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గద్గద స్వరంతో ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, రాజీనామాను సమర్పించబోతున్నట్లు తెలిపారు. బాధతో కాదు, సంతోషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, జనసంఘ్ సభ్యుడిగా పనిచేసినప్పటి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తనకు 75 ఏళ్లు దాటినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్!
యడియూరప్ప రాజీనామాతో ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవురు అవుతారన్న దానిపై పడింది. 2023లో జరగబోయే శానసభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలుపు తీరానికి చేర్చే నాయకుడు ఎవరన్న చర్చ మొదలయ్యింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు, పార్టీ శాసనసభా పక్షానికి కట్టబెట్టినట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్ వెల్లడించారు. శాసనసభా పక్షం భేటీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. యడియూరప్ప రాజీనామాకు గల కారణాలను ఆయనే వివరిస్తారని స్పష్టం చేశారు. కొత్త సీఎం ఎంపిక కోసం నిర్వహించే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment