సస్పెన్స్‌కు నేడు తెర | Suspense continues on possible change of guard in Karnataka | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌కు నేడు తెర

Published Mon, Jul 26 2021 3:31 AM | Last Updated on Mon, Jul 26 2021 10:00 AM

Suspense continues on possible change of guard in Karnataka - Sakshi

బెంగళూరు/బెళగావి: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌ నెలకొంది. సీఎం యడియూరప్పను(78) పదవిలో కొనసాగిస్తారా? లేదా అనేది సోమవారం తేలిపోనుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పదవి ఉన్నా లేకున్నా మరో 10–15 ఏళ్ల పాటు బీజేపీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పని చేస్తానని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. యడియూరప్ప ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఇంకా ఎలాంటి సందేశం రాలేదని తెలిపారు.

ఆదివారం రాత్రిలోగా లేదా సోమవారం ఉదయంలోగా సందేశం అందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే దిగిపోతా, కొనసాగాలని సూచిస్తే కొనసాగుతా అని పునరుద్ఘాటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతానని, ఆ తరువాత జరిగే పరిణామాలు మీరే తెలుసుకుంటారని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు.

ఒకవేళ బీజేపీ నాయకత్వం నుంచి సందేశం రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అప్పటి నిర్ణయం అప్పుడే తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు తదుపరి సీఎం ఎవరనే విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం ధార్వాడ్‌ నుంచి బెంగళూరుకు చేరుకోవడం, ఢిల్లీకి వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న విమాన టికెట్‌ను రద్దు చేసుకోవడం గమనార్హం. అలాగే సీఎం పదవి రేసులో ఉన్న గనుల మంత్రి మురుగేష్‌ నిరానీ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మయ్, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి.  

పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటా..  
పార్టీ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ మీరబోనని యడియూరప్ప చెప్పారు. ఆదివారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ‘‘పార్టీలో నాకు ఎన్నో పెద్ద పదవులు దక్కాయి. కర్ణాటక బీజేపీలో ఈ స్థాయిలో పదవులు పొందినవారు ఎవరూ లేరు. నాకు అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు’’అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు.  

నడ్డా ప్రశంసలు  
మరోవైపు బీజేపీ నాయకత్వం మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. యడియూరప్పపై  జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం గోవాలోని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కర్టాటక సర్కారు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందని తాను భావించడం లేదన్నారు.  

యడ్డిని కొనసాగించాల్సిందే
పదవి నుంచి దిగిపోయేందుకు మానసికంగా సిద్ధమైన యడియూరప్పకు సొంత సామాజికవర్గం వీరశైవ లింగాయత్‌ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. యడ్డిని సీఎంగా కొనసాగించాల్సిందేనని 500 మందికిపైగా వీరశైవ–లింగాయత్‌ మఠాధిపతులు డిమాండ్‌ చేశారు. బాలెహోసూరు మఠాధిపతి దింగలేశ్వర స్వామి, తిప్తూరు మఠాధిపతి రుద్రముని స్వామి, చిత్రదుర్గ మఠాధిపతి బసవకుమార్‌ స్వామి పిలుపు మేరకు బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి పెద్ద సంఖ్యలో వీరశైవ–లింగాయత్‌ మఠాధిపతులు హాజరయ్యారు. యడియూరప్పను సీఎం పదవిలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగించడం సరి కాదని వారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement