CM Change
-
తెలంగాణలో సీఎం మార్పుపై టీ- కాంగ్రెస్ లో చర్చ
-
ఆరు గ్యారంటీలేమో కానీ..ఆరు నెలలకొకసారి సీఎం మారడం పక్కా : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాజ్ డెక్కన్ హోటల్లో మంగళవారం జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్) సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది గిట్టని వాళ్ళు మేము ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ తొమ్మిదేళ్లలో కేసిఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కేసిఆర్ ప్రజల మనిషి స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. బోర్ కొట్టిందని ఎవరైనా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా. అభివృద్ధి చేసేవాళ్లు మరికొంత కాలం ఉంటే తప్పేంటి. తొమ్మిదేళ్లలో మేం అసాధారణ విజయాలు సాధించాం. ఆరున్నర సంవత్సరాల మా పని తీరు, గత 65ఏళ్ల ప్రభుత్వాల పనితీరు మీరు గమనించారు. మూసీ నది సుందరీకరణ చేస్తాం అని కాంగ్రెస్ చెప్తోంది. మూసీ నది నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? మళ్లీ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అక్కడి బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్‌లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మిస్తాం. ఆర్ఆర్ఆర్ మధ్య కొత్త హైదారాబాద్ నిర్మిస్తాం. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో భూముల విలువ గతంలో కంటే 20 శాతం పెరిగింది. గతంలో వ్యవసాయ రంగం కుంటు పడింది. అందుకే ఆనాడు భూముల విలువ లేదు’ అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి.. కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లోని అశోక్ గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. సీఎం మార్పు తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కీలకంగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కొత్త సారథిని నిర్ణయించే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకే వదిలేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్‌ను నూతన సీఎం చేయడం గహ్లోత్‌కు ఇష్టం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్‌కు గాంధీల నుంచి హామీ వచ్చిందని, ఆయనే తదపరి సీఎం అని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేగాక తాను నామినేషన్ సమర్పించిన తర్వాతే రాజస్థాన్ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి. జైపూర్‌లో జరిగే ఈ సమావేశానికి పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ మాకెన్ హాజరుకానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఖర్గేను పరిశీలకుడిగా సోనియా గాంధీ నియమించారు. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24న మొదలై 30వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువుంది. ఎన్నికలు జరిగిన రెండో రోజు అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ‘70 ఏళ్లలో ఏ నాడూ దేశం ఇలా కాలేదు’ -
కర్ణాటక సీఎం బొమ్మైకి పదవీ గండం.. మార్పు తప్పదా?
బెంగళూరు: కర్ణాటకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత.. మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందని బీజేపీలో చర్చ మొదలైంది. ఆగస్టు 15వ తేదీలోపు సీఎం బసవరాజ్ బొమ్మై స్థానంలో మరొకరిని కూర్చోబొట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్పులపై మాట్లాడిన వారిలో బీజేపీ లీడర్ బసనగౌడ పాటిల్ సైతం ఉన్నారు. ఆయన గతంలో బీఎస్ యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రి చేయనున్నారని అంచనా వేశారు. ఏడాది తర్వాత ఆయన అంచనాలే నిజమయ్యాయి. పాటిల్ తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీకి మేలు చేసే నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. ఆయన మాటలను బీ సురేశ్ గౌడ ఏకీభవించారు. దీంతో బొమ్మైకి వీడ్కోలు పలకక తప్పదనే సంకేతాలిచ్చారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ ఈ వాదనలను తోసిపుచ్చారు. బసవరాజ్ బొమ్మై తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లీలో బీజేపీ యూత్ వింగ్ నేత హత్య తర్వాత బొమ్మైకి మరిన్ని చిక్కులు వచ్చాయి. సొంత ప్రజలను కాపాడుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు.. సీఎం కానీ, రాష్ట్ర అధ్యక్షుడిని కానీ తొలగించే ఆలోచన లేదని, వారి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక. బొమ్మై కీలుబొమ్మగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయగా.. మీకు ప్రధాని మోదీ, అమిత్ షాలు చెప్పారా? అంటూ సమాధానమిచ్చారు అశోక. 2018లో జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే.. ఏడాది తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కూలదోసి బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు 2021, జూలైలో బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023, మేలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్: ఆయనే ఎందుకు
గాంధీనగర్: గుజరాత్లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్(59)ను అదృష్టం వరించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, సీనియర్ నేత తరుణ్ చుగ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు తెరపడింది. భూపేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర వెంట నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, విజయ్ రూపానీ, సి.ఆర్.పాటిల్ తదితరులు ఉన్నారు. నేడు భూపేంద్ర ఒక్కరే ప్రమాణం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాణ స్వీకా రం చేస్తారని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, 2, 3 రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ శాసనసభా పక్ష భేటీలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. మోదీ, షా, నడ్డాలకు కృతజ్ఞతలు తనపై నమ్మకం ఉంచి, ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలనే.. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది. నిజానికి తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డయ్యూ, డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు వినిపించాయి. కొత్త ముఖ్యమంత్రిగా వారిద్దలో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగింది. ఆశావహుల జాబితాలో భూపేంద్ర పటేల్ పేరు లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం. భూపేంద్ర పటేల్ గుజరాత్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. వార్డు కౌన్సిలర్ నుంచి సీఎం దాకా.. అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిపొ్లమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్ పాటిదార్ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అవుతుండడం విశేషం. ఆయనే ఎందుకు? వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను అధిష్టానం భూపేంద్ర పటేల్‌పై మోపింది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. బలమైన పాటిదార్(పటేల్) సామాజికవర్గంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు చూరగొన్న వ్యక్తి కావడమే ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. అప్పుడే మోదీ దృష్టిలో సమర్థవంతుడైన నాయకుడిగా ముద్రపడ్డారు. ఇటీవల కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించారు. పదవిలో ఉన్నప్పటికీ ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం భూపేంద్ర ప్రత్యేకత. ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆనందిబెన్ పటేల్ సిఫారసు కూడా బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపేలా చేసింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తమ పార్టీ అధిష్టానం ఆనందిబెన్ అభిప్రాయానికి విలువనిచి్చందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. లేకపోతే నితిన్ పటేల్ గానీ, మరొకరు గానీ ముఖ్యమంత్రి అయ్యేవారని వెల్ల డించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మన్సుఖ్ మాండవియా(ప్రస్తుతం కేంద్ర మంత్రి) గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పాటిదార్ వర్గం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల వెనుక చేరకుండా చూడాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని మరో నేత చెప్పాడు. గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు. -
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
-
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్: కౌన్సిలర్ స్థాయి నుంచి
గాంధీనగర్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్‌ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది. సోమవారం భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం పటేల్ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేరును ఖరారు చేశారు. విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మేరకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. పాటిదార్ సామాజిక వర్గానికే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కొనసాగనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు జరిగే భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. భూపేంద్ర చరిత్ర పూర్తి పేరు: భూపేంద్రభాయి రజనీకాంత్ భాయి పటేల్ ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ విజయం. తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి చెందిన శశికాంత్ పటేల్ పై లక్షా 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డ్ నెలకొల్పారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్‌గా బాధ్యతలు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (AUDA) చైర్మన్‌గా విధులు మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు సన్నిహితుడుగా పేరు పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ల ట్రస్టీగా ఉన్నారు. 1999-2000లో మేమ్‌నగర్ నగర్పాలిక అధ్యక్షుడు 2008-10లో AMC స్కూల్ బోర్డ్ వైస్ ఛైర్మన్ 2010-15లో తల్తేజ్ వార్డ్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నిక చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం -
కర్ణాటక సీఎం మార్పుపై నేడు రానున్న క్లారిటీ
-
సస్పెన్స్‌కు నేడు తెర
బెంగళూరు/బెళగావి: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్ నెలకొంది. సీఎం యడియూరప్పను(78) పదవిలో కొనసాగిస్తారా? లేదా అనేది సోమవారం తేలిపోనుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పదవి ఉన్నా లేకున్నా మరో 10–15 ఏళ్ల పాటు బీజేపీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పని చేస్తానని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. యడియూరప్ప ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఇంకా ఎలాంటి సందేశం రాలేదని తెలిపారు. ఆదివారం రాత్రిలోగా లేదా సోమవారం ఉదయంలోగా సందేశం అందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే దిగిపోతా, కొనసాగాలని సూచిస్తే కొనసాగుతా అని పునరుద్ఘాటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతానని, ఆ తరువాత జరిగే పరిణామాలు మీరే తెలుసుకుంటారని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం నుంచి సందేశం రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అప్పటి నిర్ణయం అప్పుడే తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు తదుపరి సీఎం ఎవరనే విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం ధార్వాడ్ నుంచి బెంగళూరుకు చేరుకోవడం, ఢిల్లీకి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్‌ను రద్దు చేసుకోవడం గమనార్హం. అలాగే సీఎం పదవి రేసులో ఉన్న గనుల మంత్రి మురుగేష్ నిరానీ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి. పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. పార్టీ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ మీరబోనని యడియూరప్ప చెప్పారు. ఆదివారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ‘‘పార్టీలో నాకు ఎన్నో పెద్ద పదవులు దక్కాయి. కర్ణాటక బీజేపీలో ఈ స్థాయిలో పదవులు పొందినవారు ఎవరూ లేరు. నాకు అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు’’అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. నడ్డా ప్రశంసలు మరోవైపు బీజేపీ నాయకత్వం మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. యడియూరప్పపై జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం గోవాలోని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కర్టాటక సర్కారు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందని తాను భావించడం లేదన్నారు. యడ్డిని కొనసాగించాల్సిందే పదవి నుంచి దిగిపోయేందుకు మానసికంగా సిద్ధమైన యడియూరప్పకు సొంత సామాజికవర్గం వీరశైవ లింగాయత్‌ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. యడ్డిని సీఎంగా కొనసాగించాల్సిందేనని 500 మందికిపైగా వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు డిమాండ్ చేశారు. బాలెహోసూరు మఠాధిపతి దింగలేశ్వర స్వామి, తిప్తూరు మఠాధిపతి రుద్రముని స్వామి, చిత్రదుర్గ మఠాధిపతి బసవకుమార్ స్వామి పిలుపు మేరకు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి పెద్ద సంఖ్యలో వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు హాజరయ్యారు. యడియూరప్పను సీఎం పదవిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగించడం సరి కాదని వారన్నారు. -
సీఎం కావడానికి అర్హతలున్నాయి: కర్ణాటక మంత్రి ఉమేష్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పెరుగుతోంది. యడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన వయసు ప్రస్తుతం 60 ఏళ్లేనని అన్నారు. పరిణామాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అవకాశం వస్తే సీఎంగా రాష్ట్రానికి సేవ చేస్తానని, చక్కటి పరిపాలన అందిస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం యడియూరప్ప ప్రకటనను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప స్వాగతించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో బీజేపీ పెద్దల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్, హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీ అధిష్టానానికి తాను ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యడియూరప్ప చెప్పారు. ఎవరి పేరునూ తాను సూచించలేదన్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనను కోరినా తదుపరి సీఎం పేరును ప్రతిపాదించలేనని స్పష్టం చేశారు. తాను పదవి నుంచి తప్పుకోవడం తథ్యమని యడియూరప్ప సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. -
దిగిపోక తప్పదు!
బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి తాను దిగిపోవడం తప్పదన్న సంకేతాలను కర్ణాటక సీఎం బి.ఎస్.యడియూరప్ప(78) ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పుపై ఆయన తొలిసారిగా గురువారం నోరు విప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వ నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును ఈ నెల 25వ తేదీన బీజేపీ నాయకత్వం ఖరారు చేయనుందని పేర్కొన్నారు. పార్టీ పెద్దల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని ఈ నెల 26న పూర్తి చేసుకోనున్నారు. ఇతరులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలో అధిష్టానానికి చెప్పానన్నారు. మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం ‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నాపై ప్రత్యేకమైన ప్రేమ, విశ్వాసం ఉన్నాయి’ అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేసి, మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తలెవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని, అందరూ తనకు సహకరించాలని కోరారు. అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. తనకు అనుకూలంగా ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని చెప్పారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. వెల్లువెత్తుతున్న సంఘీభావం సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పదని యడియూరప్ప చెబుతుండగా, మరోవైపు ఆయనకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. మఠాలు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు ఆయనకు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వీరశైవ–లింగాయత్ సామాజికవర్గం నేతలు యడియూరప్పకు అండగా నిలుస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అఖిల భారత వీరశైవ మహాసభ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆయనను పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. -
కర్ణాటకీయం: 25న కొత్త ముఖ్యమంత్రి?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్‌హాట్‌గా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పను బీజేపీ నాయకులు అంగీకరించడం లేదు. కొన్ని నెలలుగా ఆయనను పదవీచ్యుతుడిగా చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రెండు వర్గాలుగా ఏర్పడింది. అయితే ఇందులో యడియూరప్ప వ్యతిరేక వర్గం బలంగా ఉంది. యడియూరప్పను సీఎం పదవి నుంచి దింపేయాలని పలుసార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానానికి విన్నవించారు. ఇక కర్ణాటకలో బాహాటంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇక యడియూరప్పను సాగనంపాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వర్గాలు కర్ణాటక నాయకులకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. మూడు రోజుల్లో అంటే ఈనెల 25వ తేదీనే యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అధికారికంగా వెల్లడవుతున్న సమాచారం. (చదవండి: రాజీనామాకు సీఎం సిద్ధం.. చివరిసారి అందరికీ విందు) యడ్డి స్థానంలో పార్టీలోని సీనియర్ నాయకుడిని అధిష్టానం ప్రకటించనుందట. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై యడియూరప్ప స్పందించారు. అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తానని ప్రకటించారు. సీఎం పదవికి ఎవరిని సూచించినా తాను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. 78 ఏళ్ల యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జూలై 26వ తేదీన ఓ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా అవన్నీ రద్దయ్యాయి. అధిష్టానం ఆదేశాల మేరకు యడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ నియమితులవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. -
రాజీనామాకు సీఎం సిద్ధం: చివరిసారి అందరికీ విందు
బెంగళూరు: ముఖ్యమంత్రి మార్పు అంశం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి వీడుతారని చర్చ కొనసాగుతోంది. యడ్డి మార్పును సొంత పార్టీ నాయకులే కోరుతున్నారు. ఈ మేరకు అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. స్వయంగా నాయకులు మోదీ, అమిత్ షాతో సమావేశమై యడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇక రాష్ట్రంలో కూడా యడ్డికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు. ఈ పోరు భరించలేక సీఎం పదవికి రాజీనామా చేసేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని సమాచారం. అందుకనుగుణంగా కర్ణాటకలో పరిణామాలు మారుతున్నాయి. పదవి వీడేలోపు సొంత ప్రాంతం శివమొగ్గలో ముఖ్యమంత్రి హోదాలో భారీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు యడియూరప్ప కార్యాచరణ రూపొందించుకున్నారు. చివరిసారి సీఎం హోదాలో తన ప్రాంతం శివమొగ్గలో ఈనెల 23, 24వ తేదీల్లో పర్యటించేందుకు మొగ్గు చూపారు. ఇక దీంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారందరికీ భారీ స్థాయిలో ఈనెల 25వ తేదీన విందు ఏర్పాటు చేయాలని యడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయని కర్ణాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం హోదాలో మళ్లీ సచివాలయానికి రాకపోవచ్చనే ఓ స్థిర నిర్ణయానికి యడ్డి వచ్చారు. సచివాలయాన్ని వీడలేక విడిపోతున్న సందర్భంగా అందరికీ గుర్తుండేలా యడియూరప్ప ఈ మేరకు విందు నిర్వహించనున్నారట. గతవారం ఢిల్లీ పర్యటన చేపట్టగా అధిష్టానం ఆదేశాల మేరకు యడియూరప్ప పదవి వీడేందుకు సిద్ధమయ్యారని చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడ్డి బిజీబిజీగా మారారు. చివరి రోజుల్లో తన మార్క్ చూపించాలని వివిధ పనులు స్వయంగా పురమాయించుకుంటున్నారు. ఫొటో సెషన్ కూడా ఏర్పాటు చేశారంట. అయితే 2023లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే యడియూరప్ప దిగిపోవాల్సిందేనని పార్టీ నాయకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే యడ్డి సీఎం పదవి నుంచి దిగిపోనున్నారు. జూలై 26వ తేదీన యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తారని కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది. -
‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు. చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’ -
‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’
బెంగళూరు: కర్ణాటక సీఎం యడియూరప్పను తప్పిస్తారన్న వార్తలపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. యడియూరప్పను సీఎంగా తొలగించే అవకాశమే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప మా సీఎం, ఆయన పదవీకాలం ముగిసేంత వరకూ సీఎంగానే ఉంటారు. మేము ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, కర్ణాటకలో సీఎంను మార్చే ఆలోచన లేదు. ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. అంతకుముందు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు కూడా సీఎం మార్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో యట్నాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పార్టీ సజీవంగా ఉండాలంటే, ముఖ్యమంత్రి మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైన తరువాత, సీటీ రవి యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. చదవండి: కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు -
కలకలం: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం
మైసూరు: సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. ఆయన బుధవారం మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్లు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు. చదవండి: ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం
శివాజీనగర: రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యార్థకమైంది. పరిపాలనలో విజయేంద్ర వేలు పెడుతున్నారని, సీఎంను మార్చాలని యడ్డి వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అరుణ్‌సింగ్‌ను కలుస్తారని తెలిసింది. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే అవకాశముది ఇది మూడు ముక్కల ప్రభుత్వమని మంత్రి యోగీశ్వర్ ఇటీవల విమర్శలు చేయడంపై విజయేంద్ర ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన వల్ల పారీ్టకి, ప్రభుత్వానికి అవమానమైందని, వీలైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే అవకాశముంది. బళ్లారి జిల్లాలో జిందాల్‌కు ఇచ్చిన 3 వేల ఎకరాలకు పైగా భూమిని వెనక్కు తీసుకోవడంపైనా వివరణ ఇవ్వనున్నారు. హైకమాండ్ వద్ద తన వాదనను వినిపించేందుకు యడియూరప్ప తనయున్ని పంపినట్లు తెలిసింది. సీఎం మార్పు ఉండదు మైసూరు: ఢిల్లీకి ఎవరు, ఎందుకు వెళ్లారు అన్న విషయం నాకు తెలియదు, సీఎంగా యడియూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారని బీజేపి జాతీయ కార్యదర్శి సి.టి.రవి అన్నారు. మంగళవారం మైసూరులో ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడారు. బీ.వై. విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకులు అన్నాక అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కరోనా సమయంలో రాజకీయాలువద్దని అన్నారు. సీఎం మార్పు ఉండబోదని చెప్పారు. -
సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన
శివాజీనగర: ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నది కరోనా సవాల్ మాత్రమే. దానిని ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో చేస్తాను. ఢిల్లీకి వెళ్లినవారికి హైకమాండ్ తగిన సమాధానం చెప్పి పంపింది. శాసనసభా పక్ష సమావేశం గురించి మీ ముందు చర్చించలేను అని సీఎం యడియూరప్ప అన్నారు. సీఎం మార్పు కోసం బీజేపీలో ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలపై ఘాటుగా స్పందించారు. జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కలసికట్టుగా కోవిడ్ ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఎవరో ఒకరు ఎక్కడికో వెళ్లి వచ్చారంటే వారికి హైకమాండ్ సమాధానం చెప్పి పంపారు కదా అన్నారు. యడియూరప్పని తొలగించాలని బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేశారని వార్తలు రావడం తెలిసిందే. -
సీఎం కుర్చీ నుంచి నన్నెవరూ దింపలేరు
బెంగళూరు: తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. సీఎం మార్పుపై కర్నాటకలో సాగుతున్న ప్రచారంపై శనివారం యడియూరప్ప స్పందించారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత ఏప్రిల్ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల ప్రకటన చేశాడు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు తనపై విశ్వాసం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప సవాళ్లతో సహవాసం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది. -
వసుంధర కుర్చీకి ఎసరు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ కంగుతింది. ఆ అవమానకర ఓటమి నుంచి ఇంకా తేరుకోని కమలం పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ ఓటమికి బాధ్యుల్ని చేస్తూ రాబోయే రోజుల్లో సీఎం వసుంధర రాజేను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. 1999 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాజస్తాన్ పెట్టని కోటగా ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తోన్న ప్రస్తుత తరుణంలో 3 స్థానాల్ని చేజార్చుకోవడం బీజేపీనీ కలవరానికి గురిచేస్తోంది. అల్వార్ లోక్‌సభ స్థానంలో దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడంపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడిని అమిత్ మందలించినట్లు తెలుస్తోంది. అర్జున్ మేఘ్వాల్తో అమిత్‌షా చర్చలు రాజస్తాన్ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్తో అమిత్ షా శనివారం దాదాపు గంటకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రత్యామ్నాయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి నుంచి వసుంధర రాజేను తప్పిస్తే ఆమె వర్గం ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళనలో బీజేపీ నాయకత్వం ఉంది. తనను తప్పించే ప్రయత్నాలు చేస్తే ధీటుగా స్పందిస్తానని ఇప్పటికే వసుంధరా రాజే అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఆమె వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారన్న దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. పార్టీలోని కొందరు సీఎం పదవికి అర్జున్ మేఘ్వాల్ పేరుపై ఆసక్తి చూపుతుండగా.. జాట్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అమిత్ షాకు సన్నిహితుడిగా పేరుపడ్డ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపిందర్ యాదవ్ పేరుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో సీఎం మార్పుతో పార్టీకి నష్టం జరవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రాయల తెలంగాణకే జేసీ ఓటు
హైదరాబాద్: ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సీఎం మార్పు అనేది ఊహాగానామే అని ఆయన కొట్టిపారేశారు. సీఎం కిరణ్ అధిష్టాన విధేయుడని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నప్పటికి విభజన పక్రియలో హైకమాండ్ డైరెక్షన్ ప్రకారమే ఆయన నడుచుకుంటారని అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ కావాలని మొదటినుంచి కోరుతున్నానని వెల్లడించారు. ఈ అంశంతో పాటు ఇతర రాజకీయ అంశాలను చర్చించేందుకే కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో హైకమాండ్ పెద్దలు సమావేశమౌవుతున్నారేమోనని అన్నారు. మహబూబ్‌నగర్ బస్సుప్రమాద ఘటనపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. -
15 రోజుల్లో సీఎం మార్పు ఖాయం: పాల్వాయి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో సీఎం మార్పు ఖాయమని చెప్పారు. సీమాంధ్ర నుంచి కొత్త సీఎం వస్తారని వెల్లడించారు. 12 వారాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందని అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం పరిధిలో ఉన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం రాదు.. నోట్ మాత్రమే వస్తుందని పాల్వాయి తెలిపారు. కాగా, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని మాజీ పి. శంకర్రావు కూడా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సీఎం రేసులో ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాల్వాయి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.