
తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు.
బెంగళూరు: తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. సీఎం మార్పుపై కర్నాటకలో సాగుతున్న ప్రచారంపై శనివారం యడియూరప్ప స్పందించారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు.
ఉగాది తర్వాత ఏప్రిల్ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల ప్రకటన చేశాడు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు. అమిత్ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు తనపై విశ్వాసం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప సవాళ్లతో సహవాసం చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది.