రాజస్తాన్ సీఎం వసుంధర రాజే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ కంగుతింది. ఆ అవమానకర ఓటమి నుంచి ఇంకా తేరుకోని కమలం పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ ఓటమికి బాధ్యుల్ని చేస్తూ రాబోయే రోజుల్లో సీఎం వసుంధర రాజేను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. 1999 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాజస్తాన్ పెట్టని కోటగా ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తోన్న ప్రస్తుత తరుణంలో 3 స్థానాల్ని చేజార్చుకోవడం బీజేపీనీ కలవరానికి గురిచేస్తోంది. అల్వార్ లోక్‌సభ స్థానంలో దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడంపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడిని అమిత్ మందలించినట్లు తెలుస్తోంది.
అర్జున్ మేఘ్‌వాల్‌తో అమిత్‌షా చర్చలు
రాజస్తాన్ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్‌తో అమిత్ షా శనివారం దాదాపు గంటకుపైగా చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రత్యామ్నాయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి నుంచి వసుంధర రాజేను తప్పిస్తే ఆమె వర్గం ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళనలో బీజేపీ నాయకత్వం ఉంది. తనను తప్పించే ప్రయత్నాలు చేస్తే ధీటుగా స్పందిస్తానని ఇప్పటికే వసుంధరా రాజే అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే ఆమె వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారన్న దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. పార్టీలోని కొందరు సీఎం పదవికి అర్జున్ మేఘ్‌వాల్ పేరుపై ఆసక్తి చూపుతుండగా.. జాట్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అమిత్ షాకు సన్నిహితుడిగా పేరుపడ్డ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపిందర్ యాదవ్ పేరుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో సీఎం మార్పుతో పార్టీకి నష్టం జరవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment