రాజస్థాన్ సీఎంగా రాజే ప్రమాణం
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
అద్వానీ, మోడీ హాజరు
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో ఆ రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వా ప్రమాణం చేయించారు. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన 60 ఏళ్ల వసుంధర రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. రాజే ప్రమాణస్వీకార కార్యక్రమం జైపూర్‌లోని శాసనసభ ఆవరణలో అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత అద్వానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, పలువురు మతగురువులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా వసుంధరా రాజే కాషాయ రంగు చీర ధరించారు. మత పెద్దలు ఆమెను ఆశీర్వదించారు. రాజ్‌నాథ్, మోడీ, అద్వానీ, అశోక్ గెహ్లట్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం వసుంధరా రాజే నేరుగా సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. మొన్నటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకుగానూ బీజేపీ 162 స్థానాలను గెలిచి తిరుగులేని మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.
యూపీ నుంచి మోడీ పోటీ!
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని యూపీ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ‘ఇండియా టుడే’ శుక్రవారం పేర్కొంది. అయితే ‘ఏ స్థానం నుంచి మోడీ పోటీ చేస్తారన్న’ తుది నిర్ణయాన్ని మాత్రం జనవరిలో ప్రకటించనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. జనవరి 15 తర్వాతే ఎన్నికల సీట్లను కేటాయించాలని అనుకుంటున్నారని, హిందూ కేలండర్ ప్రకారం.. అప్పుడు శుభదినాలున్నాయని అంటున్నారు. అటల్ బీహారీ వాజ్‌పేయి సొంత నియోజకవర్గమైన లక్నో నుంచిగాని, మురళీ మనోహర్ జోషి సొంత నియోజకవర్గమైన వారణాసి నుంచి గాని మోడీని పోటీకి దింపాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది.