కశ్మీర్‌లో లవ్ వార్
- లడఖ్‌లో లవ్ జీహాద్ మంటలు
- ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన ఎల్‌బీఏ
- ఉద్రిక్తంగా పరిస్థితులు
శ్రీనగర్: కశ్మీర్‌లో మళ్లీ మరో వివాదం రాజుకుంది.. సరిహద్దు గొడవలు, ఉగ్రదాడులు.. రాళ్లు రువ్వుకోవడం వంటివి కాకపోయినా.. అంతే స్థాయిలో మంటలు రేగుతున్నాయి. ఈ వివాదాన్ని ప్రధాని నరేంద్రమోదీకి వివరించేందుకు ఒక వర్గంవారు అపాయింట్‌మెంట్ కోరడంతో వివాదం స్థాయి మరింత పెరిగింది. కశ్మీర్‌లో రాజుకున్న వివాదంపై పూర్తి వివరాలు ఇవే.
కొంత కాలంగా శ్రీనగర్‌లోని లద్దాక్ బుద్ధిస్ట్ అసోసియేషన్(ఎల్‌బీఏ) స్థానిక ముస్లింల మధ్య వివాదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. లవ్ జీహాద్ ఇందుకు కారణం అని ఎల్‌బీఏ చెబుతోంది. లవ్ జీహాద్‌పై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సదరు సంస్థ పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. గత ఏడాది బౌద్ధమతానికి 30 ఏళ్ల అమ్మాయిని మత మార్పడి చేసి ఒక ముస్లిం అబ్బాయి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ వివాహం చెల్లదని బౌద్దులు వాదిస్తున్నారు. పెళ్లి చేసుకున్న వారిని వేధించడం సరికాదని ఈ ఏడాది రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన బౌద్దులు.. ఈ పెళ్లిని రద్దు చేయడం కోసం చివరి రక్తపు బొట్టువరకూ పోరాడతాం అని ప్రకటించారు.
లడఖ్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి వివరిస్తామని అందుకోసం ఆయన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎల్‌బీఏ చెబుతోంది. లడఖ్‌లో బౌద్ధుల జనాభా 51 శాతం ఉంటుంది. చదువుకున్న, అందంగా ఉన్న బౌద్ధమతానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని బౌద్ధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడేళ్లలో ఇలా 45 మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చారని లడఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ చెబుతోంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి చేసుకున్న వారిని రహస్య ప్రదేశంలో సురక్షితంగా ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో 1989 నుంచి ఇరువర్గాల మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో దాదాపు దశాబ్దకాలం పాటు ముస్లింల వస్తువులు కొనకుండా బౌద్దులు బహిష్కరించారు. ముస్లింలు లవ్‌జీహాద్‌ను మానకపోతే భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయని బౌద్ధులు చెబుతున్నారు.