
'లవ్ జీహాద్' పై వెనక్కి తగ్గిన బీజేపీ
మధుర: ‘లవ్ జీహాద్’పై నిప్పులు కక్కిన ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ వెనక్కి తగ్గింది. ఆదివారమిక్కడ ముగిసిన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంలో చేసిన రాజకీయ తీర్మానంలో దీన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ముస్లిం యువకులు ప్రేమ పేరుతో హిందూ యువతులను తమ మతంలోకి మార్చేందుకు కుట్రపన్నుతున్నారని, ఈ లవ్ జీహాద్‌పై అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ ఆదివారం పిలుపునివ్వడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. బీజేపీ ఎంపీ హేమమాలిని నటించిన సినిమాల్లో ముస్లిం-హిందూ సంబంధాలే చూపారన్నారు.
దీనిని ఇక్కడితో ముగింపుపలకాలని భావించిన బీజేపీ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. యూపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దృష్టి పెట్టింది. అఖిలేష్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మహిళలు, బాలికలపై జరుగుతున్న అరాచాకాలు 50 శాతం వరకూ పెరిగినట్లు బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. గత 30 నెలల్లో 1,981 వరకూ అత్యాచార కేసులు నమోదైనట్లు స్పష్టం చేశాయి.
అంతకుముందు 'లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లైసెన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వమే లవ్‌జీహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో లక్ష్మీకాంత్ బాజ్‌పేయి శనివారం ఈ వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ విధానాల వల్లనే రాష్ట్రంలో మతకలహాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు.