‘ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు’ | No one can separate us now, says Kerala Hindu woman who wed Muslim man | Sakshi
Sakshi News home page

‘ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు’

Published Tue, Oct 24 2017 2:55 PM | Last Updated on Tue, Oct 24 2017 2:58 PM

No one can separate us now, says Kerala Hindu woman who wed Muslim man

సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లిని కేరళ హైకోర్టు కూడా ధ్రువీకరించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు. నేను చచ్చేవరకు హిందువుగానే జీవిస్తాను. ఇక అనీస్‌ హమీద్‌ కూడా జీవితాంతం ముస్లింగానే జీవిస్తాడు’ అని 24 ఏళ్ల శృతి మెలెడత్‌ వ్యాఖ్యానించారు. అనీస్‌ హమీద్‌తో జరిగిన వివాహాన్ని అక్టోబర్‌ 19వ తేదీన హైకోర్టు ధ్రువీకరించాక ఆమె మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమె ఎర్నాకులంలోని ‘శివశక్తి యోగ విద్యా కేంద్రం’లో అనుభవించిన నరకయాతనను, తనను పెళ్లి చేసుకోవడం కోసం ఆరు నెలలపాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ హమీద్‌ అనుభవించిన బాధను మీడియాతో పంచుకున్నారు.

కన్నూర్‌ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న పిలాతర ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో శృతి, హమీద్‌లు 2010 నుంచి 2013 వరకు కలసి చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఫిజిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ కోసం శృతి, కన్నూర్‌ యూనివర్శిటీకే అనుబంధంగా ఉన్న తాలిపరంబ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో చేరారు. డిగ్రీ తర్వాత కోజికోడ్‌లో ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేసిన హమీద్‌ ఎంబీఏ కరస్పాండెన్స్‌ కోర్సు కూడా పూర్తి చేసి 2015లో ఢిల్లీలోని ఓ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. పీజీ పూర్తి చేసిన శృతిని పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తుండడంతో అప్పటికీ టచ్‌లో ఉన్న హమీద్‌తో విషయం చెప్పింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంతో హమీద్, శృతి ఇంటికి తన తల్లిని తీసుకొని వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారు. అందుకు శృతి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించలేదు.

ఇక ఎప్పటికీ తమ పెళ్లిని శృతి తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రహించిన శృతి, హమీద్‌లు గత మే 16వ తేదీన ఢిల్లీకి పారిపోయారు. అక్కడి సోనెపట్‌లో కొన్ని రోజులు కలసి జీవించారు. ఇంతలో శృతి తలిదండ్రులు హమీద్‌కు వ్యతిరేకంగా క్రిమినల్‌ కేసు దాఖలు చేయడంతో కేరళ పోలీసులు వచ్చి శృతి, హమీద్‌లను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. శృతిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిన పోలీసులు మే 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు జుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఇంట్లో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌కు ‘లవ్‌ జిహాద్‌’ కేసని వివరించారు. శృతిని తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. పోలీసులు అలాగే చేశారు. తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లాక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవద్దంటూ శృతికి నయాన, భయాన చెప్పి చూశారు. ఎంతకు వినిపించుకోకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని శివశక్తి యోగా విద్యా కేంద్రంలో చేర్చారు.

అక్కడ నరకాన్ని చూశాను!
ఇతర మతంలోకి మారిన హిందువులను లేదా ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను హితబోధ ద్వారా మళ్లీ హిందూ మతంలోకి తీసుకరావడం ఈ యోగా విద్యా కేంద్రం ప్రధాన లక్ష్యం. కేరళలో ఇలాంటి కేంద్రాలు ఇంకా మూడు, నాలుగు పనిచేస్తున్నాయి. ఆ కేంద్రంలో తనతో అరవ చాకిరి చేయించారని, ఉదయం 4 గంటలకు ముఖాన నీళ్లు చల్లి బలవంతంగా లేపేవారని, వంట పాత్రలను కడగడంతోపాటు వంట చేయడం, యోగా కేంద్రాన్ని ఊడవడంతో సహా రాత్రి పది గంటల వరకు ఎడతెగని పని చేయించేవారని శృతి వివరించారు. తాను కేంద్రానికి వెళ్లినప్పుడు తనతోపాటు ఇతర మతాల యువకులను ప్రేమించిన 60 మంది యువతులు ఉన్నారని, వారందరితోని కూడా చాకిరి చేయించారని ఆమె చెప్పారు. హిత బోధనలు చేయడం కన్నా మతం మారినా, మతాంతర వివాహం చేసుకున్నా చంపేస్తామనే ఎక్కువ బెదిరించారని ఆమె తెలిపారు. జూన్‌ 26 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు అందులో నరకం అనుభవించానని చెప్పారు.

కోర్టు జోక్యంతో న్యాయం
హమీద్‌ తనను పెళ్లి చేసుకోవడం కోసం హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా న్యాయపోరాటం మొదలుపెట్టి విజయం సాధించారని శృతి తెలిపారు. కోర్టు జోక్యంతో తాము తిరిగి కలుసుకునే అవకాశం లభించడంతో అక్టోబర్‌ 9వ తేదీన ‘స్పెషల్‌ మారేజెస్‌ యాక్ట్‌’ కింద పెళ్లి చేసుకున్నాం. ఆ మరుసటి రోజే హైకోర్టుకు హాజరయ్యాం. సిరియాలో ఐఎస్‌ టెర్రరిస్టుల తరఫున యుద్ధం చేయడం కోసమే హమీద్‌ తనను పెళ్లి చేసుకున్నారని ప్రాసిక్యూటర్‌ వాదించారన్నారు. దాన్ని తాను తీవ్రంగా ఖంచించానని, కాలేజీ రోజుల నుంచి తమ మధ్యనున్న అనుబంధం గురించి వివరించానని చెప్పారు. చచ్చేవరకు హిందువుగానే జీవిస్తానని కూడా చెప్పానని ఆమె అన్నారు. తన ధైర్యానికి కోర్టు కూడా మెచ్చుకున్నదని తెలిపారు. తమ పెళ్లి చెల్లుతుందని కోర్టు ప్రకటించిందని చెప్పారు.

అత్తా మామలను కూడా కోరుకుంటున్నాను
మీడియాతోని శృతి మాట్లాడుతున్నంత సేపు మౌనంగా ఉన్న హమీద్, తాను అత్తామామలతో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. వారు మనసు మార్చుకునే వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని అన్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపండంటూ మీడియా విష్‌చేయగా, ఇంకా తమ కష్టాలు తీరలేదని, ఈ పాటికి తన ఉద్యోగం పోయే ఉంటుందని హమీద్‌ అన్నారు. తనకు ఐఎస్‌ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ తనను అరెస్ట్‌ చేయడానికి ఢిల్లీ వచ్చిన కేరళ పోలీసు అధికారి తన బాస్‌తో చెప్పారని, అది బాస్‌ నమ్మి ఉంటే ఉద్యోగం పోవడం ఖాయమన్నారు.

(ఇప్పటికీ మతతత్వ శక్తుల నుంచి  శృతి, హమీద్‌ ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారి ఫొటోలను గుర్తించేలా ప్రచురించడం లేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement