భోపాల్ : రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ ఆరోపించారు. ఆయన కారణంగానే తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ సురేంద్రనాథ్ కూతురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల చిత్ర హింసలు తట్టుకోలేక అఙ్ఞాతంలోకి వెళ్లినట్లు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సురేంద్రనాథ్... భోపాల్‌లో ఉన్న హుక్కా లాంజ్ యజమానులు వెంటనే వాటిని మూసివేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో వాటి భద్రతకు భంగం వాటిల్లితే తననేమీ ప్రశ్నించకూడదని మీడియా ముఖంగా తెలియజేశారు.(చదవండి : బలవంతపు పెళ్లి చేస్తున్నారు: బీజేపీ నేత కూతురు)
‘హుక్కా లాంజ్‌లు కేంద్రంగా లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వీటితో సంబంధం ఉంది. నా కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారింది. అసలు పిల్లలు హుక్కా లాంజ్‌లకు ఎందుకు వెళ్తున్నారు. వారికి హుక్కా తాగాల్సిన అవసరం ఏమిటి? దయచేసి ఇప్పటి నుంచి ఎవరూ హుక్కా సెంటర్లకు వెళ్లకండి. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు. కానీ భోపాల్‌లో మాత్రం హుక్కా సెంటర్లు ఉంటే సహించేది లేదు’ అని సురేంద్రనాథ్ హెచ్చరించారు. ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ.. ఐదేళ్లుగా తాను డిప్రెషన్‌తో బాధ పడుతుందని.. అందుకు చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. మానసికంగా కుంగిపోయిన తనతో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతీ తండ్రి తన కూతురిని తన మతం వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడతాడని.. అందుకు తానేమీ మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. దేవుడిని విశ్వసిస్తూ.. సంస్కృతీ సంప్రదాయాలు పాటించే వ్యక్తికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భోపాల్‌లో లవ్ జిహాదీ కొనసాగితే క్రూసేడ్లు(మత యుద్ధాలు) చేయడానికి కూడా తాము వెనుకడుగువేయబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment