యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్(ఫైల్ ఫొటో)
లక్నో: బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్ గురించి చర్చ నడుస్తున్న తరుణంలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు(యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక) దీనికి వ్యతిరేకంగా చట్టం రూపొందిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020ను తీసుకువచ్చింది. దీని ప్రకారం.. బలవంతంగా, కేవలం వివాహం కోసమే మతాన్ని మార్పించడం వంటి అంశాలను నేరంగా పరిగణిస్తారు. (చదవండి: ముస్లిం కుర్రాళ్లను హెచ్చరించిన ఎస్పీ ఎంపీ)
అంతేగాకుండా ఈ తరహా కేసుల్లో బెయిలు కూడా మంజూరు చేయకుండా కఠిన చర్యలు తీసుకునే వెసలుబాటు ఉంటుంది. అదే విధంగా నేరం రుజువైతే కనిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మేర జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇష్టప్రకారమే మతం మార్చుకోవాలని ఎవరైనా భావిస్తే రెండు నెలల ముందుగానే సంబంధిత అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా యోగి సర్కారు నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇక మేజర్లైన ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చినవారితో జీవితాన్ని పంచుకునే హక్కు ఉంటుందని.. ఇందులో మూడో వ్యక్తి జోక్యం తగదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ఆర్డినెన్స్ వెలువడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment