
'లవ్ జీహాద్ పై ఆమెకు అభ్యంతరం లేదు'
లక్నో: ‘లవ్ జీహాద్’పై బీజేపీ, సమాజ్వాది పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హిందూ యువతను ఇస్లాం వైపు ఆకర్షించే 'లవ్ జిహాద్'కు యూపీలో అధికార సమాజ్వాది పార్టీ అండదండలు అందిస్తోందని బీజేపీ ఆరోపించింది. తమ ప్రభుత్వంపై బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం అఖిలేష్ యాదవ్ తిప్పికొట్టారు. ప్రేమను ప్రోత్సహించడం వెనుక తమ ప్రమేయం లేదని, ఆ మాటకొస్తే బీజేపీ నేతలు కూడా లవ్ జిహాద్ ను సమర్థించారంటూ ఎదురుదాడికి దిగారు.
లవ్ జీహాద్ పట్ల సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఎటువంటి అభ్యంతరం చేయలేదన్న విషయాన్ని అఖిలేష్ గుర్తు చేశారు. 1970 ప్రాంతంలో వచ్చిన 'ధర్మాత్మ' సినిమాలో హిందువు యువకుడిని ప్రేమించిన పాత్రలో హేమమాలిని నటించారని తెలిపారు. 'లవ్ జిహాద్'కు అనుకూలంగా ఉన్న పాటలో కూడా ఆమె నర్తించారని చెప్పి బీజేపీని ఇరుకున పెట్టారు. హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని బీజేపీ ఆరోపించింది.