
'లవ్ జిహాద్' అంటే ఏమిటి?
న్యూఢిల్లీ:దేశ వ్యాప్తంగా 'లవ్ జిహాద్'పై దుమారం రేగుతున్న సమయంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందువుల సంస్కృతిని దెబ్బతీసేందుకు 'లవ్ జిహాద్'పేరిట కుట్ర జరుగుతుందని బీజేపీ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ అంశానికి సంబంధించి బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు ఏమీ తెలియదట. అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి? ఆ వాక్యానికి ఉన్న అర్ధం ఏమిటని? ప్రశ్నించడం ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీ యోగీ ఆదిత్యానాథ్ 'లవ్ జిహాద్'అంశాన్ని మరోసారి ప్రస్తావించడంతో రాజ్ నాథ్ దానిపై వివరణ అడిగారు.అందులో ఉన్న నిగూఢమైన అర్ధాన్నితెలపాలని బీజేపీ శ్రేణులను కోరారు.
అంతకుముందు 'లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లైసెన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు.