భోపాల్: ‘మంచిగా మాట్లాడితే చాలూ కొత్త వాళ్లకైనా సరే మన అమ్మాయిలు ఇట్టే పడిపోతారు. అందుకే పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటల ఉదంతాలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి అమ్మాయిల్ని కట్టడి చేయాలి’.... మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అగర్ మాల్వా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మర్ శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘మన ప్రభుత్వాలు అమ్మాయిలకు వివాహర్హత వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాయి. కానీ, ఇప్పుడు అదే కొంప ముంచుతోంది. తియ్యటి మాటలకు మన అమ్మాయిలు సులువుగా వలలో పడిపోతారు. ఆ సమయంలో వాళ్లకు ఆలోచించే శక్తి ఉండదు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లవ్ జిహాదీ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి, తల్లులు వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. లవ్ జిహాద్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది’ అని ఆయన మాట్లాడారు.
బాల్య వివాహాలకు మద్ధతుగా మాట్లాడుతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ‘వివాహ వయసును నిర్ణయించటంలో ప్రభుత్వ ఉద్దేశాలు వేరే అయి ఉండొచ్చు. కానీ, కొంత మంది ముస్లింలు పేర్లు మార్చుకుని హిందూ యువతులను మోసం చేస్తున్నారు. నాకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అలాగని బాల్య వివాహాలను నేను ప్రొత్సహించను. 18 ఏళ్లలోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదిర్చండి. అప్పుడు వాళ్లకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావన్నదే నా అభిప్రాయం’ అని పర్మర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షం, ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం సాయంత్రం కొంత మంది విద్యార్థులు భోపాల్ హైవే పై ధర్నా చేపట్టారు. పర్మర్ క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment