న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీఎన్‌ఎక్స్ నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేలో అంచనా వేసింది. సాధారణంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిన్‌లు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకం. ఈ ఐదు నగరాల్లో ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే అంత ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. ఈసారి బీజేపీ గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజారిటీ బాగా తగ్గుతుందనీ, 230 సీట్లున్న శాసన సభలో బీజేపీ 122, కాంగ్రెస్ 95 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే నివేదిక వెల్లడించింది.
2013 ఎన్నికల్లో బీజేపీకి 165, కాంగ్రెస్‌కు 65 సీట్లు వచ్చాయి. ఈ నెల 28న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉండే సీట్లలో 70శాతం బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనీ, కాంగ్రెస్ 27శాతమే దక్కించుకోగలదని సర్వే వెల్లడించింది. చౌహాన్ ముఖ్యమంత్రి కావాలని 40.11% ఓటర్లు కోరుకోగా, కమల్‌నాథ్‌కు 20.32%, జ్యోతిరాదిత్య సింధియాకు 19.65% మద్దతు పలికారు. ప్రాంతాల వారీగా చూస్తే చంబల్ మినహా మల్వా నిమార్, బఘేల్‌ఖండ్,భోపాల్, మహాకౌశల్‌లలో ఇతర పార్టీల కంటే బీజేపీదే పైచేయిగా ఉంది.సర్వేలో భాగంగా 77 నియోజకవర్గాల్లో 9240 మంది అభిప్రాయాలను సేకరించారు.
రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు నగరాలు... భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిన్‌లు రెండు పార్టీలకూ కీలకం. ఈ ఐదు నగరాల్లో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంతవరకు ఈ నగరాలు బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈ కోటల్ని బద్దలు కొట్టగలిగితేనే చౌహాన్ అధికారంలోకి రాకుండా నిరోధించగలుగుతుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నగరాల్లో బీజేపీదే పై చేయి. గత ఎన్నికల(2013)విషయానికి వస్తే ఇక్కడున్న 36 సీట్లలో బీజేపీ 30 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇవి కాకుండా సత్నా, సాగర్ వంటి వాణిజ్యప్రధాన ప్రాంతాలు కూడా పార్టీ గెలుపులో కీలక భూమిక వహిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఇక్కడి 51 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సీట్లే కాక ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇటీవలి సర్వేలో పట్టణాల్లో బీజేపీ ఓట్ల శాతం 40 నుంచి 45 శాతానికి పెరిగిందని, కాంగ్రెస్ ఓట్ల శాతం 25–35 శాతాల మధ్య ఊగిసలాడుతోందని వెల్లడయింది. ఓట్ల శాతంలో తక్కువ తేడా ఉన్నా సీట్ల సంఖ్యలో తేడా వస్తుంది. ఈ కారణంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందని టైమ్స్ నౌ తేల్చింది. ఏబీపీ–సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42శాతం ఓట్లు, బీజేపీకి 40శాతం వస్తాయని అంచనా వేసింది.
ఈ తేడాను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే 117 సీట్లు గెలుచుకోవడం కష్టం కాదని ఆ సర్వే పేర్కొంది. అయితే, ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టి ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుందనీ, అదంత సులభం కాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, వ్యవసాయ సంక్షోభం, బీజేపీ ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఉపయోగించుకుని, విభేదాల్ని తాత్కాలికంగానైనా పక్కనపెట్టి గట్టి అభ్యర్ధులను పోటీకి దింపితే–ముఖ్యంగా ఈ ఐదు నగరాల్లో– ఫలితాలను తిరగరాసే అవకాశాలు కాంగ్రెస్‌కు ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment