రాజ్ బబ్బర్, సీపీ జోషి
ఇండోర్/అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీపీ జోషి, రాజ్ బబ్బర్‌లు..ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు. మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి దిగువ కులాలకు చెందినవారని, వారికి హిందూయిజం గురించి ఏమీ తెలియదని సీపీ జోషి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్ బబ్బర్, జోషితో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు జోషి క్షమాపణ చెప్పినా బీజేపీ శాంతించలేదు. జోషి హిందూ మతం, సంస్కృతిని అవమానించారని, ధైర్యముంటే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌కు సవాలు విసిరింది.
మన్మోహన్‌ను అవమానించారు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని అన్నారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment