cp joshi
-
ఆ సభాపతి గురి.. ఆరోసారి!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఐదేళ్లకు మించి ఏ పార్టీకి అధికారం ఇవ్వని రాజస్థాన్ ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేక కాంగ్రెస్‌కి మరోసారి అధికారం ఇచ్చి కొత్త సంప్రదాయానికి తెరతీస్తారా శనివారం జరగనున్న ఎన్నికల్లో తేలనుంది. ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సీపీ జోషి ఎమ్మెల్యేగా ఆరోసారి గెలుపుపై గురి పెట్టారు. అత్యంత సీనియర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన సీపీ జోషికి కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1998-2003లో రాజస్థాన్ మంత్రివర్గంలో పనిచేశారు. 2009లో భిల్వారా నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ క్యాబినెట్లో రైల్వే మంత్రిగా, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కూడా కొద్దికాలం పనిచేశారు. స్పీకర్‌గా గుర్తింపు 2020లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా సీపీ జోషి వ్యవహరించిన పాత్ర చర్చనీయాంశమైంది. తిరుగుబాటుదారులపై అనర్హత నోటీసులు కూడా జారీ చేయడమే కాకుండా దీనిపై సుప్రీంకోర్టును సైతం ఆయన ఆశ్రయించారు. విద్యావేత్త కూడా.. సీపీ జోషి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడే కాకుండా విద్యావేత్త కూడా. అర్హత కలిగిన న్యాయవాది అయిన ఆయన ఉదయపూర్‌లోని కళాశాలలలో సైకాలజీ బోధించేవారు. 1973లో మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం రాజకీయాలలో ఆయన తొలి అడుగు. ఎమ్మెల్యేగా ఐదుసార్లు సీపీ జోషి 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నాథ్‌ద్వారా నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2003-2005 మధ్య రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. నాథ్‌ద్వారా ఎన్నికల్లో ప్రముఖ మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు, బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్‌తోనూ ఆయన తలపడ్డారు. ఒకే ఒక్క ఓటుతో.. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సీపీ జోషి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై కేవలం ఒకే ఒక ఓటు తేడాతో సీటును కోల్పోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రచార కమిటీకి సారథ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీ జోషి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
CP Joshi: లోక్‌సభలో ‘సతీ’ కామెంట్ల దుమారం
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ సతీ సహగమన కామెంట్ల దుమారం చెలరేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చను చేపట్టారు. బీజేపీ ఎంపీ సీపీ జోషి(చంద్రప్రకాశ్ జోషి) రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను జోషి ప్రారంభించారు. అయితే.. అదే సమయంలో ఈ చిత్తోడ్‌ఘడ్(రాజస్థాన్) ఎంపీ సతీ సహగమనం ఆచారాన్ని కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఆ సమయంలో డీఎంకే ఎంపీ ఏ రాజా.. సీపీ జోషి కుర్చీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అయితే.. వాయిదా సమయంలోనే ఆయన పలువురు ఎంపీలు, ప్రత్యేకించి మహిళా ఎంపీలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆపై సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇక ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాలు మళ్లీ కేంద్ర వ్యతిరేక నినాదాలతో సమావేశాలను అడ్డుకునే యత్నం చేస్తున్నాయి. -
రాజస్తాన్ డ్రామాకు తెర
జైపూర్: రాజస్తాన్ రాజకీయ డ్రామాకు ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించారు. దాంతో గవర్నర్, కాంగ్రెస్ సర్కార్ల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. అంతకుముందు, బుధవారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్ వెనక్కు పంపించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో తను కోరిన వివరణలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, అసెంబ్లీ భేటీలను ప్రారంభించడానికి సహేతుక కారణం పేర్కొంటూ మళ్లీ ప్రతిపాదన పంపాలని గవర్నర్ పేర్కొన్నారు. దాంతో, బుధవారం మళ్లీ సమావేశమైన సీఎం గహ్లోత్ కేబినెట్.. ఆగస్ట్ 14 నుంచి సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. కేబినెట్ సిఫారసులను వెనక్కు పంపిస్తూ.. గవర్నర్ ప్రతీసారి ప్రస్తావిస్తున్న 21 రోజుల నోటీసు పీరియడ్ నిబంధన అమలయ్యేలా ఆగస్ట్ 14వ తేదీని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం గహ్లోత్ ఎంచుకున్నారు. గవర్నర్‌కు తొలి ప్రతిపాదన పంపిన జులై 23 నుంచి పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనను పంపించారు. స్వల్ప వ్యవధి నోటీసుతో సమావేశాలను ప్రారంభించేందుకు కారణం చూపకపోతే 21 రోజుల నోటీసు వ్యవధితో సమావేశాలను ప్రారంభించవచ్చని గత ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రేమ లేఖ అందింది: ఈ నేపథ్యంలో గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో దాదాపు పావుగంట పాటు సీఎం గహ్లోత్ సమావేశమయ్యారు. ‘ప్రేమ లేఖ అందింది. తేనీటి సేవనం కోసం ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తున్నాను’అని రాజ్‌భవన్‌కు వెళ్లేముందు గహ్లోత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో సమావేశం తరువాత కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం, ఆగస్ట్ 14 నుంచి శాసన సభ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్ పంపించారు. మరోవైపు, గవర్నర్ కల్రాజ్ మిశ్రాను బుధవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి కలిశారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశామని, స్పీకర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా తెలిపారు. -
రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి..
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ సర్కార్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్త ఎమ్మెల్యేలకు జారీచేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రక్రియను వాయిదా వేయాలని ఈనెల 21న రాజస్ధాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ స్పీకర్ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఈనెల 24న యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశిస్తూ జారీ చేసిన సమగ్ర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ప్రస్తావించినందున ఈ పిటిషన్‌ను ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ను స్పీకర్ సీపీ జోషీ కోరారు. జోషీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వినతి మేరకు పిటిషన్ ఉపసంహరణకు అనుమతించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించింది. మరోవైపు రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చారు. కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి : ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం -
హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించింది. వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసును వ్యతిరేకిస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో అనర్హత చర్యల విషయంలో జూలై 24 వరకు స్పీకర్‌ను నిరోధిస్తూ రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ స్పీకర్ సి.పి.జోషి సుప్రీంకోర్టులో బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 19 మంది ఎమ్మెల్యేల వినతిపై తదుపరి ఉత్తర్వు ఇవ్వడానికి రాజస్తాన్ హైకోర్టుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఈ ఉత్తర్వు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తర్వు ఇవ్వకుండా హైకోర్టును తాము అడ్డుకోలేమని వెల్లడించింది. అంతేకాకుండా అనర్హత వేటు విషయంలో తనను నిరోధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న స్పీకర్ వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. అసమ్మతి గొంతు నొక్కేయలేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చట్ట సభల సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని స్పీకర్ సి.పి.జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. స్పీకర్ ముఖ్యమైన ప్రశ్నలను లెవనెత్తారని, దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉందని తేల్చిచెప్పింది. స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, వారు సొంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి స్వరాన్ని నొక్కేయలేమని వ్యాఖ్యానించింది. స్పీకర్ పిటిషన్‌పై విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 19 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌పై రాజస్తాన్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేయనుంది. షెకావత్‌పై విచారణ జరపండి సంజీవని క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరపాలని జైపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టు రాజస్తాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సొసైటీలో వేలాది మంది సొమ్ము మదుపు చేశారు. సొసైటీ నిర్వాహకులు ఇందులో రూ.900 కోట్లను మింగేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) దర్యాప్తు చేస్తోంది. 2019 ఆగస్టు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఇందులో షెకావత్ పేరును చేర్చలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గులామ్సింగ్, లాబూ సింగ్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. సహకార సొసైటీ కుంభకోణంలో పాత్రదారులైన కేంద్ర మంత్రిని, మరికొందరిని ఎస్ఓజీ ఉద్దేశపూర్వకంగానే రక్షిస్తోందని ఫిర్యాదుదారులుఆరోపిస్తున్నారు. టేపులను విదేశాలకు పంపిస్తాం: గహ్లోత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కుట్ర పన్నారని సీఎం గహ్లోత్ మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఆయన మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు ముమ్మాటికీ నిజమైనవేనని ఉద్ఘాటించారు. ఫోరెన్సిక్ టెస్టు కోసం వాటిని విదేశాల్లోని సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. షెకావత్ ఏ తప్పూ చేయకపోతే స్వర నమూనా ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వానికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సచిన్ పైలట్ వర్గం కోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందిస్తూ.. వారంతా కోర్టుకు వెళ్లి తప్పు చేశారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో న్యాయస్థానానికి సంబంధం లేదని గుర్తుచేశారు. -
అనర్హతపై కోర్టు జోక్యమా?
న్యూఢిల్లీ: స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎప్పుడూ ఊహించలేనిదని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పేర్కొన్నారు. ఇది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఈనెల 24వరకు తనను నిరోధిస్తూ రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో(చట్టసభ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి) న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్ అధికారాలను తగ్గించి వేయడమే అవుతుందన్నారు. స్పీకర్ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జూలై 23న విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో దీన్ని చేర్చింది. ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. స్పీకర్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు రాజస్తాన్ శాసన సభ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తన వాదన, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. జోషి పిటిషన్‌పై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, తమ వాదన సైతం వినాలని సచిన్ పైలట్ కోరుతున్నారు. తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పు బీజేపీలో చేరాలంటూ తనకు రూ.కోట్లు ఎర చూపారని సంచలన ఆరోపణలు చేసిన రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మాలింగకు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం తన అడ్వొకేట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మాలింగ అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ప్రసార మాధ్యమాల సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఒక రూపాయి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో సచిన్ పైలట్ నివాసంలోనే తనను ప్రలోభాలకు గురి చేశారని గిరిరాజ్‌సింగ్ మాలింగ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 7 నెలలుగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మాలింగ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ క్యాంపులో ఉన్నారు. సచిన్ పైలట్ నుంచి తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసు రాలేదని, దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని మాలింగ చెప్పారు. మోదీకి గహ్లోత్ లేఖ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం గహ్లోత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. ‘ఇదంతా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, కొందరు మమ్మిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకోవడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనుచిత ఘటనలే చోటుచేసుకున్నాయని అశోక్ గహ్లోత్ గుర్తుచేశారు. గహ్లోత్ సోదరుడి నివాసాలపై ఈడీ దాడులు 2007–09 నాటి ఎరువుల కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు, విత్తనాలు, ఎరువుల సంస్థ ‘అనుపమ్ కృషి’ వ్యవస్థాపకుడు అగ్రసేన్ గహ్లోత్ నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బధవారం దాడులు నిర్వహించింది. అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జోద్పూర్ జిల్లాలోని మాందోర్ ప్రాంతంలో ఉన్న అగ్రసేన్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్ల రక్షణ మధ్య ఈ సోదాలు జరిగాయి. అగ్రసేన్తో సంబంధాలున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ నివాసం, ఇద్దరు రాజస్తాన్ కాంగ్రెస్ నాయకులు, మరో వ్యాపార సంస్థపైనా ఈడీ దాడులు జరిగాయి. రాజస్తాన్‌లో 6 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లో 2, గుజరాత్లో 4, ఢిల్లీలో ఒక ప్రాంతంలో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాజస్తాన్‌లో 2007– 09లో మారియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ)ను రైతులపై రాయితీపై సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, రూ.60 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఫిర్యాదు మేరకు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద(పీఎంఎల్ఏ) కేసు నమోదైంది. దాడులతో బెదిరించలేరు: సూర్జేవాలా మోదీ దేశంలో దాడుల రాజ్యం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం మండిపడ్డారు. ఈ దాడులకు తమ పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలు బీజేపీలో పన్నిన ఉచ్చులో చిక్కుకోలేదని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి నివాసంపై దాడులు ప్రారంభించారని ఆరోపించారు. -
‘నన్ను ఎదుర్కోలేక మా అమ్మను తిడుతున్నారు’
భోపాల్ : రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. తనని ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెస్ నేతలు తన తల్లిని దూషిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ నేతలకు సమస్యలపై మాట్లాడే సత్తా లేక ఇతరుల తల్లులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారి మాటలు చూస్తుంటే మోదీని ఢీకొట్టలేని నిస్సహాయతలో ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. కానీ తాను మాత్రం గత 17 ఏళ్లుగా కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తూ.. ఓడిస్తున్నాననీ తెలిపారు. పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని, వారి డిపాజిట్లు గల్లంతు కావద్దనే మోదీ తల్లిని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని, తమది రిమోట్ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. ఇండోర్‌లో గత గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో సీపీ జోషి ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. -
కాంగ్రెస్ నేతల నోటి దురుసు
ఇండోర్/అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీపీ జోషి, రాజ్ బబ్బర్లు..ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు. మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి దిగువ కులాలకు చెందినవారని, వారికి హిందూయిజం గురించి ఏమీ తెలియదని సీపీ జోషి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్ బబ్బర్, జోషితో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు జోషి క్షమాపణ చెప్పినా బీజేపీ శాంతించలేదు. జోషి హిందూ మతం, సంస్కృతిని అవమానించారని, ధైర్యముంటే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌కు సవాలు విసిరింది. మన్మోహన్‌ను అవమానించారు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని అన్నారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని అన్నారు. -
అవి కాంగ్రెస్ విలువలకు విరుద్ధమన్న రాహుల్..
సాక్షి, న్యూఢిల్లీ : హిందుత్వం గురించి బ్రాహ్మణులకు మాత్రమే తెలుసని, దీనిపై వారే మాట్లాడగలరని సీనియర్ కాంగ్రెస్ నేత సీపీ జోషీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విభేదించారు. కాంగ్రెస్ పార్టీ విలువలకు జోషీ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతినే ప్రకటనలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని సూచించారు. జోషీ తన పొరపాటును గుర్తించి పార్టీ సిద్ధాంతాలను గుర్తెరుగుతారని ఆశిస్తున్నానన్నారు. ఆయన తన ప్రకటనపై విచారం వెలిబుచ్చాలని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి జోషీ చేసిన వ్యాఖ్యల వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో హిందుత్వ గురించి మాట్లాడుతున్న ఉమా భారతి, సాధ్వి రితంబర ఏ కులానికి చెందిన వారో తెలుసా అంటూ ఈ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశంలో మతం గురించి ఎవరికైనా తెలుసంటే వారు పండిట్లు, బ్రాహ్మణులు మాత్రమేనన్నారు. లోధి అయిన ఉమాభారతి, మరోవైపు ప్రధాని మోదీ హిందుత్వం గురించి మాట్లాడటాన్ని ఆయన ఆక్షేపిస్తూ మతం, పాలన వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించారు. వారి మతాన్ని అనుసరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. రాజస్ధాన్‌లోని నద్వారాలో జరిగిన ఓ కార్యక్రమంలో జోషీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్‌లో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై నిషేదం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌పై కొనసాగుతున్న నిషేదాన్ని ఎత్తి వేసింది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. ఇక 2014లో రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. హైకోర్టు సూచనలతో ఈ ఏడాది జూన్‌లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో లలిత్ మోదీ కుమారుడు రుచిర్ పై కాంగ్రెస్ నేత సీపీ జోషి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక సుప్రీం నియమించిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ రాజస్థాన్ బోర్డు ఏర్పాటు చేసిన అడహక్ కమిటీని రద్దు చేయడంతో నిషేదం ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది. ఈ నిషేదంతో ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఎలాంటి అంతర్జాతీయ, దేశావాళి మ్యాచ్‌లను నిర్వహించలేదు. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లను సైతం జైపూర్‌కు తరలించారు. -
లలిత్ మోదీకి చుక్కెదురు
జైపూర్: విదేశాల్లో ఉంటూనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో చక్రం తిప్పాలనుకున్న లలిత్ మోదీకి చుక్కెదురైంది. ఆర్సీఏ అధ్యక్షుడిగా పోటీచేసిన లలిత్ తనయుడు రుచిర్ మోదీ ఓటమిపాలయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్సీఏ ఎన్నికల ఫలితాల్లో.. మోదీ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సీపీ జోషి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19 ఓట్లు సాధించగా, రుచిర్ మోదీకి కేవలం 14 ఓట్లు మాత్రమే పొలయ్యాయి. అయితే ఆర్సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం మోదీ అనునాయులకే దక్కడం గమనార్హం. సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రజరర్‌గా పింకేశ్‌జైన్‌లు ఎన్నికయ్యారు. ఐపీఎల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన లలిత్ మోదీ అరెస్ట్ భయంతో కొన్నేళ్ళ కిందటే భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచివెళ్లే క్రమంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు సహకరించారనే ఆరోపణలున్నాయి.