ప్రధాని నరేంద్ర మోదీ
భోపాల్ : రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. తనని ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెస్ నేతలు తన తల్లిని దూషిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ నేతలకు సమస్యలపై మాట్లాడే సత్తా లేక ఇతరుల తల్లులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారి మాటలు చూస్తుంటే మోదీని ఢీకొట్టలేని నిస్సహాయతలో ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. కానీ తాను మాత్రం గత 17 ఏళ్లుగా కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తూ.. ఓడిస్తున్నాననీ తెలిపారు. పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని, వారి డిపాజిట్లు గల్లంతు కావద్దనే మోదీ తల్లిని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని, తమది రిమోట్ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.
ఇండోర్‌లో గత గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో సీపీ జోషి ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment