కోల్‌కత : మమతా బెనర్జీ తనకు ప్రతియేడు రెండు జతల కుర్తాలు, స్వీట్లు పంపుతారని బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. దీనిపై మమత భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే..‘ఈ సారి మోదీకి గులక రాళ్లతో చేసిన మిఠాయిలు పంపుతా.. అవి తిన్నవెంటనే ఆయన పళ్లు ఊడిపోవడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటుడు రాజ్‌బబ్బర్ మోదీ, దీదీ రాజకీయా దోస్తులు అంటూ విమర్శలు గుప్పించారు.
‘బెంగాల్‌లో తయారయ్యే కమ్మని నేతి మిఠాయిలు, కుర్తాలు ఫేమస్. తమ రాష్టానికి వచ్చిన అతిథులకు ఈ రెండు బహుకరించడం మామూలే. అయితే, ఇప్పటివరకు మమతా ఏ పొలిటీషియన్‌కి కుర్తాలు బహుకరిచంలేదు. కేవలం 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తికి మాత్రమే గిఫ్ట్‌గా ఇచ్చారు. వారిమధ్య రాజకీయ స్నేహం ఉందని మోదీ మాటల్లో తెలిసిపోయింది. ఆయన కుర్తా కొలతలు దీదీకి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. తనది 56 అంగుళాల ఛాతీ అని మోదీ అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని బబ్బర్ గుర్తు చేశారు.
బెంగాల్‌లో బీజేపీ బలోపేతానికి తృణమూల్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. కాగా, బబ్బర్ వ్యాఖ్యలపై తృణమూల్ అధికార ప్రతినిధి పార్థ ఛటర్జీ మండిపడ్డారు. సినిమాల్లో మాదిరి ఇతరులపై అర్థపర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.సినిమాలు రాజకీయాలు ఒకటి కావనే విషయం తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వామపక్ష నేత సీతారాం ఏచూరి కూడా టీఎంసీ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. బెంగాల్‌లో కుస్తీ పడుతున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి.. ఢిల్లీలో దోస్తీ కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ప్రజలు ఆమోదించరని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment