
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా రాహుల్‌తో పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు.
అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం జోడో యాత్రపై ఇంతవరకు స్పందించలేదు. ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మమతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు విపక్షాలన్నీ ఎకమవ్వాలని చూస్తుంటే.. మమత మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించారు. మోదీకి, దీదీకి మధ్య 'మో-మో' ఒప్పందం ఉందని, ప్రధానిని అప్‌సెట్ చేసేలా మమత ఏ పని చేయరని ఆరోపించారు.
మోదీకి వత్తాసు..
శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినా మమత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అధిర్ రంజన్ అన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ను అంతమొందించాలని మోదీ అంటే.. దీదీ కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే మమత బెనర్జీ కూడా ఇదే విషయమై ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. ప్రధాని మోదీకి ఎదురు నిలబడే సత్తా దీదీకి ఉందని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో విపక్షాలను ఆమె ముందుండి నడిపించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే పలువురు నేతలు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రజాభీష్టం మేరకు ప్రధాని పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు.
చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం
Comments
Please login to add a commentAdd a comment