రాష్ట్రంలోని 42 స్థానాలకు 29 చోట్ల టీఎంసీ ఘన విజయం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మేజిక్ మరోసారి పనిచేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో 42 స్థానాలకుగాను 29 చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు, సందేశ్‌ఖాలీసహా రాష్ట్రంలో పలు చోట్ల అంతర్గత సమస్యలు తలెత్తినా అవేమీ దీదీ నేతృత్వంలో టీఎంసీ విజయయాత్రను ఆపలేకపోయాయి. పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు ఒడిసిపట్టాలని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కాళ్లకు బలపం కట్టుకుని మరీ తెగ ప్రచారంచేశారు.
ఎగ్జిట్ పోల్స్ సైతం ఈసారి బెంగాల్‌లో కమలవికాసం ఖాయమని అంచనాలు వెలువరిచాయి. ఈసారి మోదీ మేనియా ఉండొచ్చన్న రాజకీయ పండితుల లెక్కలూ తప్పు అని మమత మరోసారి నిరూపించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కొనసాగబోనంటూ వేరుబడి కూడా సార్వత్రిక ఎన్నికల్లో మమత జయకేతనం ఎగరేయడం విశేషం. ‘ బెంగాల్‌లో బీజేపీ అంతర్గత కలహాలు, వ్యవస్థాగతంగా బలహీనంగా ఉండటం, బలమైన లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో తృణమూల్ వ్యతిరేక ఓటును బీజేపీ తనవైపునకు తిప్పుకోలేకపోయింది’ అని రాజకీయ విశ్లేషకుడు మైదుల్ ఇస్లామ్ చెప్పారు. అందుకే 2019తో పోలిస్తే తృణమూల్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగి 47 శాతానికి చేరుకుంది. బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లాగే సీపీఐ(ఎం) పార్టీ ఈసారి కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది.
జట్టు కట్టకపోవడంతో పుంజుకుంది
కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు ఒప్పందం నుంచి మమత జనవరిలోనే వైదొలగడం టీఎంసీకి బాగా కలిసి వచ్చింది. దీంతో త్రిముఖపోరులో మైనారిటీలు, బీజేపీ వ్యతిరేకులు మరోమార్గంలేక టీఎంసీకే ఓటేశారు. గతంలో బీజేపీ సైతం ఇలాగే టీఎంసీ వ్యతిరేక ఓట్లను ఒడిసిపట్టి 2014లో 17 శాతంగా ఉన్న ఓటు షేరును 2019లో 40 శాతానికి పెంచుకుంది. స్థానిక సమస్యలు, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగాల రద్దు, సీఏఏ అమలు అంశాలు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి.
మైనారిటీ ఓటుతో పైపైకి
మైనారిటీల బలం దీదీ పార్టీకి ఎంతో దోహపడింది. సీఏఏ అమలు, రామకృష్ణమిషన్, భారత్ సేవాశ్రమం సంఘ్‌లను వ్యతిరేకిస్తూ మమత వ్యాఖ్యలు, 77 ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదా రద్దుచేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పుతో మమత మాత్రమే తమను పట్టించుకుంటారని భావించి మైనారిటీలు టీఎంసీ వెంట నడిచి పార్టీ విజయాన్ని సులభం చేశారు. లక్ష్మీర్ భండార్, కన్యశ్రీ పథకాల లబ్ధిపొందిన మహిళలూ మమతకు మద్దతు పలికారు.
మోదీ తక్షణమే రాజీనామా చేయాలి: మమత
లోక్‌సభ ఎన్నికల్లో నైతిక ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి వైదొలగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లు సాధిస్తుందంటూ ప్రచారం చేసుకున్న మోదీ వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని సైతం సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. మోదీ విశ్వసనీయత కోల్పో యారు. ఇండియా గెలిచింది. మోదీ ఓడిపోయారు. ఎన్నో రాజకీయ పారీ్టలను ఆయన ముక్కలుచెక్కలుగా చేశారు. ప్రజలే ఆయన్ను నైతికంగా దెబ్బకొట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మోదీ టీడీపీ, నితీశ్ కుమార్‌ల వద్ద కాళ్లబేరానికి వచ్చారు’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment