కోల్‌కతా: ఇండియా కూటమిలో చీలిక మరోసారి బయటపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సేవ చేయడంలో మమతా బెనర్జీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయగలదని చెప్పారు.
"మేము భిక్ష అడగలేదు. మమతా బెనర్జీ స్వయంగా తనకు పొత్తు కావాలని చెప్పారు. మమతా బెనర్జీ దయ మాకు అవసరం లేదు. మేము సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ సేవ చేయడంలో బిజీగా ఉన్నందున ఆమెతో పొత్తులు కోరుకోవడం లేదు.' అని అధీర్ రంజన్ చౌధరి అన్నారు.
ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీ పొత్తు గురించి అడినప్పుడు అధీర్ రంజన్ చౌధరి ఈ మేరకు స్పందించారు. వివరాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు టీఎంసీ రెండు సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధీర్ రంజన్ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బీజేపీని గద్దె దింపే ధ్యేయంతో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో టీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును టీఎంసీనే మొదట సూచించింది. అటు.. కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: 'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment