న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీని కేంద్ర ప్రభుత్వం విజయవతంగా నిర్వహించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ స్థాయి నేతగా ప్రధాని మోదీ మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇదే సమయంలో, జీ20 భేటీ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఏకంగా 300 శాతం ఎక్కువగా రూ.4,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయడంపై కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
‘ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రభుత్వం ఇన్ని కోట్లను ఖర్చుచేసింది. ఈ సొమ్మును బీజేపీ ఎందుకు చెల్లించకూడదు? అని పేర్కొన్నాయి. జీ20 భేటీ నిర్వహణ ఖర్చుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 4న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొన్ని వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచారు. జీ20 సదస్సు జరిగిన ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.4,110.75 కోట్లు ఖర్చయినట్లు ఆమె పేర్కొన్నారు.
ఇందులో అత్యధికంగా రూ.3,600 కోట్లను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) పేరుతో ఖర్చయ్యాయి. మొత్తం ఖర్చులో ఇది 88 శాతం. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో సముదాయం నిర్మాణానికైన వాస్తవ వ్యయం రూ.3,600 కోట్లు. దీనికే జీ20 శిఖరాగ్రం సందర్భంగా భారత్ మండపం అనే పేరు పెట్టారు. ఇది శాశ్వత నిర్మాణం, జీ20 బడ్జెట్‌తో దీనికి సంబంధం లేదు. 2017లో ఈ భవనం నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు రూ.2,254 కోట్లు కాగా, రహదారులు, టన్నెళ్ల నిర్మాణానికి మరో వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ రెండింటిని కలుపుకుంటే భారత్ మండపం అభివృద్ధి వ్యయం రూ.3,200 కోట్లు దాటింది.
రహదారులు, టన్నెళ్లు పోను భారత్ మండపం కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.2,700 కోట్లు వెచ్చించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) జూలై 26న ప్రకటించింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ జీ20 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు దుబారా ఖర్చు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ విమర్శలపై చార్టెర్డ్ అకౌంటెంట్ గోపాల్ కేడియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ శాశ్వత మౌలిక వసతుల కల్పనకైన ఖర్చును జీ20 నిర్వహణ వ్యయంతో కలిపి చెప్పడం సరికాదన్నారు.
ఈ నిర్మాణాలు భవిష్యత్తులో జరిగే మరెన్నో కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. బడ్జెట్‌లో కేటాయించిన రూ.990 కోట్ల కంటే చాలా తక్కువగా జీ20 శిఖరాగ్రానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment