ఆల్వార్/విదిశ: అయోధ్య కేసును ఈ ఏడాది తొలి నాళ్లలో విచారించాలనుకున్న సుప్రీంకోర్టు జడ్జీలను అభిశంసన పేరిట కాంగ్రెస్ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. లాయర్లు కూడా అయిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కొందరు..ఈ కేసును 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా సాగదీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని విమర్శించారు.
రాజస్తాన్‌లోని ఆల్వార్, మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఆదివారం జరిగిన ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తన తల్లిదండ్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం లేకే తన కులం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కులతత్వం, పేదలు, అణగారిన వర్గాలపై ద్వేషాన్ని కాంగ్రెస్ నరనరాల్లో నింపుకుందని ధ్వజమెత్తారు.
అది ప్రమాదకర క్రీడ..
ఆల్వార్ సభలో మోదీ మాట్లాడుతూ రాజ్యసభలో తనకున్న సంఖ్యాబలం చూసుకుని కాంగ్రెస్ సుప్రీంకోర్టు జడ్జీలను బెదిరిస్తోందని ఆరోపించారు. ‘ పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగిలే కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త ప్రమాదకర క్రీడను ప్రారంభించింది. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి కేసుల విచారణ టైం టేబుల్‌ను తయారుచేయకుంటే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, లాయర్లు అయిన కొందరు వ్యక్తులు అభిశంసన పేరిట ఆ జడ్జిని బెదిరిస్తారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా మేధావులు ఈ ప్రమాదకర ధోరణిని ఎండగట్టాలి. మోదీ కులం ఆధారంగా ఓట్లు పడతా యా? మోదీ జన్మస్థలం ఆధారంగా రాజస్తాన్ భవిష్యత్ నిర్మితమవుతుందా?’ అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ప్రధాని ప్రశ్నించారు. మోదీ దిగువ కులానికి చెందిన వాడని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు.
నా తల్లిదండ్రులు పదవులు చేపట్టలేదు..
తన తల్లిదండ్రుల్ని కాంగ్రెస్ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల్లోకి లాగడంపై విదిశలో జరిగిన సభలో మోదీ మండిపడ్డారు. గాంధీ– నెహ్రూ కుటుంబంపై చేసిన విమర్శల్ని సమర్థించుకున్న మోదీ..తన తల్లిదండ్రులు వారిలా రాజకీయాలు, ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నారు. ‘నామ్‌దార్ (రాహుల్‌ను ఉద్దేశించి) అండ చూసుకునే కాంగ్రెస్ నాయకులు 30 ఏళ్ల క్రితం చనిపోయిన నా తండ్రికి రాజకీయాల్లోకి లాగుతున్నారు. లేవనెత్తడానికి వారికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదు. అందుకే నా తల్లిదండ్రులు లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా తల్లి ఇంటికే పరిమితమై పూజలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతోంది. రాజ్‌నీతిలోని ‘ఆర్’ అనే పదం కూడా ఆమెకు తెలియదు’ అని మోదీ అన్నారు.
మోదీ 50వ ‘మన్‌కీ బాత్’
న్యూఢిల్లీ: మాసాంతపు ‘మన్‌కీ బాత్’ ప్రసంగ కార్యక్రమాన్ని రాజకీయాలకు దూరంగా ఉం చి, ప్రజల ఆకాంక్షలకు వేదికగా చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన వ్యక్తిగత, ప్రభు త్వ విజయాల్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదన్నారు. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన ‘మన్‌కీ బాత్’ ఆదివారం 50వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో రేడియో అత్యంత శక్తిమంతమైన సాధనమని, అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు మోదీ చెప్పారు. కుటుంబాల్లో యువత, పెద్దల మధ్య కమ్యూనికేషన్ అంతరం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి చర్చిస్తే భావవ్యక్తీకరణ ప్రభావవంతంగా ఉంటుందన్నారు. చదువు, అలవా ట్లు, జీవన శైలి గురించి మాత్రమే యువతరం తో చర్చిస్తున్నామని, అలాకాకుండా ఎలాంటి హద్దుల్లేకుండా, ఏమీ ఆశించకుండా జరిపే చర్చలతోనే ఫలితం ఉంటుందన్నారు.
‘అభిశంసన’తో జడ్జీలనే బెదిరించారు
Published Mon, Nov 26 2018 4:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment