censures
-
‘అభిశంసన’తో జడ్జీలనే బెదిరించారు
ఆల్వార్/విదిశ: అయోధ్య కేసును ఈ ఏడాది తొలి నాళ్లలో విచారించాలనుకున్న సుప్రీంకోర్టు జడ్జీలను అభిశంసన పేరిట కాంగ్రెస్ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. లాయర్లు కూడా అయిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కొందరు..ఈ కేసును 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా సాగదీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని విమర్శించారు. రాజస్తాన్‌లోని ఆల్వార్, మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఆదివారం జరిగిన ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తన తల్లిదండ్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం లేకే తన కులం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కులతత్వం, పేదలు, అణగారిన వర్గాలపై ద్వేషాన్ని కాంగ్రెస్ నరనరాల్లో నింపుకుందని ధ్వజమెత్తారు. అది ప్రమాదకర క్రీడ.. ఆల్వార్ సభలో మోదీ మాట్లాడుతూ రాజ్యసభలో తనకున్న సంఖ్యాబలం చూసుకుని కాంగ్రెస్ సుప్రీంకోర్టు జడ్జీలను బెదిరిస్తోందని ఆరోపించారు. ‘ పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగిలే కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త ప్రమాదకర క్రీడను ప్రారంభించింది. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి కేసుల విచారణ టైం టేబుల్‌ను తయారుచేయకుంటే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, లాయర్లు అయిన కొందరు వ్యక్తులు అభిశంసన పేరిట ఆ జడ్జిని బెదిరిస్తారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా మేధావులు ఈ ప్రమాదకర ధోరణిని ఎండగట్టాలి. మోదీ కులం ఆధారంగా ఓట్లు పడతా యా? మోదీ జన్మస్థలం ఆధారంగా రాజస్తాన్ భవిష్యత్ నిర్మితమవుతుందా?’ అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ప్రధాని ప్రశ్నించారు. మోదీ దిగువ కులానికి చెందిన వాడని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు. నా తల్లిదండ్రులు పదవులు చేపట్టలేదు.. తన తల్లిదండ్రుల్ని కాంగ్రెస్ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల్లోకి లాగడంపై విదిశలో జరిగిన సభలో మోదీ మండిపడ్డారు. గాంధీ– నెహ్రూ కుటుంబంపై చేసిన విమర్శల్ని సమర్థించుకున్న మోదీ..తన తల్లిదండ్రులు వారిలా రాజకీయాలు, ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నారు. ‘నామ్‌దార్ (రాహుల్‌ను ఉద్దేశించి) అండ చూసుకునే కాంగ్రెస్ నాయకులు 30 ఏళ్ల క్రితం చనిపోయిన నా తండ్రికి రాజకీయాల్లోకి లాగుతున్నారు. లేవనెత్తడానికి వారికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదు. అందుకే నా తల్లిదండ్రులు లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా తల్లి ఇంటికే పరిమితమై పూజలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతోంది. రాజ్నీతిలోని ‘ఆర్’ అనే పదం కూడా ఆమెకు తెలియదు’ అని మోదీ అన్నారు. మోదీ 50వ ‘మన్‌కీ బాత్’ న్యూఢిల్లీ: మాసాంతపు ‘మన్‌కీ బాత్’ ప్రసంగ కార్యక్రమాన్ని రాజకీయాలకు దూరంగా ఉం చి, ప్రజల ఆకాంక్షలకు వేదికగా చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన వ్యక్తిగత, ప్రభు త్వ విజయాల్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదన్నారు. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన ‘మన్‌కీ బాత్’ ఆదివారం 50వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో రేడియో అత్యంత శక్తిమంతమైన సాధనమని, అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు మోదీ చెప్పారు. కుటుంబాల్లో యువత, పెద్దల మధ్య కమ్యూనికేషన్ అంతరం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి చర్చిస్తే భావవ్యక్తీకరణ ప్రభావవంతంగా ఉంటుందన్నారు. చదువు, అలవా ట్లు, జీవన శైలి గురించి మాత్రమే యువతరం తో చర్చిస్తున్నామని, అలాకాకుండా ఎలాంటి హద్దుల్లేకుండా, ఏమీ ఆశించకుండా జరిపే చర్చలతోనే ఫలితం ఉంటుందన్నారు. -
అభిశంసన అంత సులభం కాదు
ప్రజానుకూల విధానాలు అనుసరించని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్ మినహా పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇందుకు 2019 ఎన్నికలు సమీపిస్తూండటం ఒక కారణం కాగా, బీజేపీ బలహీనపడుతూండటం కూడా మరొక కారణం. గత నాలుగేళ్ళుగా బీజేపీ, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా, ప్రజా వ్యతిరేక పాలననే కొనసాగించింది. అంతేగాక, మేధావులపైనా, ప్రజాస్వామికవాదులపైనా, దళి తులు, మైనార్టీలపైనా హత్యలు, దాడులు బీజేపీ పాలనలో పెచ్చు పెరిగిపోయాయి. పాలకవర్గాల్లో అసహనం, ప్రజల్లో అభద్రత పెరిగాయి. కనుక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం మరింతగా పెరిగింది. అయితే, ఏది ప్రత్యామ్నాయం, అనేదే కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయస్థాయి మహాసభలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడం. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నిటితో కలిపి కూటమి ఏర్పడాలనే విధానం సీపీఐలో ఇప్పటికే స్పష్టంగానే వుంది. అంటే, కాంగ్రెస్‌ను కూడా కలుపుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయ సారాంశం. అయితే సీపీఎం విధానం అంత సూటిగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ విధానం అటూ ఇటూ మారుతూ వస్తోంది. 1964 నాటి పార్టీ చీలికకు ఆనాటి సీపీఐ నాయకత్వం చేపట్టిన కాంగ్రెస్ అనుకూల పోకడే ప్రధాన కారణం అని సీపీయం నాయకత్వం ఆనాడు స్పష్టంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏ ప్రజాస్వామిక, ఆర్థిక, సామాజిక విధానాలపరమైన వ్యత్యాసాల కారణంగా 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీడీపీని బలపరిచిందో, ఆ పార్టీ నాయకత్వమే చెప్పాలి. ప్రస్తుతం ప్రతిపాదిస్తోన్న బీజేపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ స్థానం ఏమిటి, అన్నది ముఖ్యమైన అంశంగా సీపీఎంలో చర్చ జరుగుతూండటం బహిరంగ రహస్యమే. వాస్తవానికి 1964 నాటి చీలిక ప్రకారం రెండు పార్టీలు, సీపీఐ, సీపీఎంలుగా కొనసాగాలంటే కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల విధానాల ప్రాతిపదిక ఉండితీరాలి. ఆ ప్రాతిపదికే లేకపోతే అప్పుడు పార్టీని చీల్చడమే తప్పు; ఇప్పుడు రెండు పార్టీలుగా కొనసాగడం అంతకన్నా తప్పు. నేటి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండబట్టేనేమో, సీపీఐ నాయకత్వం రెండు పార్టీల విలీనాన్ని పదేపదే బలంగా ప్రతిపాదిస్తూ వస్తోంది. ఆ ప్రతిపాదనను సీపీయం నాయకత్వం అదేపనిగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ తిరస్కరణకు సీపీఎం నాయకత్వం మనస్సులో ఏ కారణాలు పని చేస్తున్నాయో ప్రజలకైతే అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎంతటి జుగుప్సాకరంగా, అవినీతిమయంగా, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందో చెప్పటానికి ప్రబలమైన ప్రత్యక్ష సాక్ష్యం, 2014 ఎన్నికల్లో ప్రజలు పచ్చి మతోన్మాద బీజేపీని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టటమే. గతంలో వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, పదేళ్ల కాంగ్రెస్ యుపిఎ పరిపాలన అనంతరం నాలుగేళ్ల కిందట తిరిగి బిజెపి బహు పెద్ద మెజారిటీతో అధికార పీఠానికి ఎగబాకడం చూసిన తరువాత కూడా, మళ్ళీ కాంగ్రెస్‌తో కలిసిన ప్రత్యామ్నాయాల గురించి సీపీఐ, సీపీఎంలు ఆలోచించటం ఎంతటి ఆత్మవంచన? ఎంతటి ఆత్మహత్యా సదృశ్యం? అసలు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? అది రాజకీయ విధాన ప్రత్యామ్నాయంగా వుండాలి. ఆ రాజకీయ విధానం అభివృద్ధికరమైన, మార్పు దిశగా నడిచే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన స్వభావంతో కూడుకుని ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలుగానీ, సీపీఐ, సీపీఎంలు ప్రతిపాదిస్తోన్న కూటమిలోని భాగస్వామ్య ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలు గానీ, ప్రజానుకూలంగా వున్నాయా? కనీసం ఆ సీపీఐ, సీపీఎంలు సమర్థించేవిగానైనా వున్నాయా? ప్రజానుకూల విధానాలు అనుసరిం చని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్‌ను మినహాయించి పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీ ఉగ్రవాద హిందుత్వ పార్టీకాగా, కాంగ్రెస్ తదితర పార్టీల్లో హెచ్చు భాగం ఉదారవాద హిందుత్వ పార్టీలే. తరతమ తేడాలేతప్ప స్వభావం మాత్రం ఒక్కటే. మరో ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ, ఏదో ఒక దశలో మతోన్మాద బీజేపీతో చెలిమి చేసినట్టివే. ఏవో తమ సొంత కారణాల వల్ల ఆ పార్టీకి ఈ పార్టీలు ప్రస్తుతం దూరంగా వుండవచ్చు. అంతమాత్రాన బీజేపీతో జతకట్టగలిగిన ఆ పార్టీల అలనాటి స్వభావం మారిందనుకోలేం. మారినట్లుగా దాఖలాలూ లేవు. ఇప్పుడు తాము ప్రతిపాదిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చదలచుకుంటోన్న ఒక్కొక్క పార్టీ గత చరిత్రను సీపీఐ., సీపీఎం.లు బహిరంగంగా ప్రకటించాలి. ఈ పార్టీలు బీజేపీ దగ్గరకు జరిగినా, లేక, దూరంగా వెళ్ళిపోయినా అవి తమ అప్పటి అవసరాల కోసం, అవకాశవాదంతో ఏర్పరచుకొన్న వైఖరే తప్ప, విధానపరమైన నిర్ణయాలు కావు. ఇలాంటి శక్తులతో కలసి నిజమైన బిజెపి వ్యతిరేక కూటమిని సీపీఐ, సీపీఎంలు నిర్మించడం సాధ్యమేనా? సామాజిక న్యాయం, కుల వివక్షలను గురించి మాటల్లో చెప్పడం కాదు. అది చేతల్లో కనపడాలి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ రంగంలో స్పష్టంగా ప్రతిబింబించాలి. దినదినం క్షీణించిపోతున్న తమ ఉనికిని నిలబెట్టుకొని, బలపడి.. సామాజిక కులవర్గ దృక్పధంతో ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి కమ్యూనిస్టు పార్టీల మçహాసభలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొనడంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. నిజమైన కమ్యూనిస్టులుగా, నిజమైన సామాజిక రాజకీయ శక్తులతో కలిసి, నిజమైన ప్రత్యామ్నాయ, రాజకీయ శిబిరాన్ని నిర్మించడమా? లేక, బూటకపు లౌకిక శక్తులు, బూటకపు ప్రజాతంత్ర శక్తులతో జతకట్టి, బూట కపు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమా? ఇవే, సీపీఐ, సీపీఎం మహాసభల ముందున్న నిజమైన ప్రత్యామ్నాయాలు. కొసమెరుపు : బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఫ్రంట్‌కు సీపీఎం అంగీకరించనున్నట్లు తాజా వార్తలు. - ఇంటర్వ్యూ : జీకేఎం రావు, సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ -
అభిశంసనే సమాధానం కాదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అభిశంసన అన్ని సమస్యలకు పరిష్కారం కాదని.. వ్యవస్థను సరిచేయటమే సరైన మార్గమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనాలకు కేసులు కేటాయించటంలో సీజేఐ పాత్రకు సంబంధించిన పలు ప్రశ్నలకూ చలమేశ్వర్ సమాధానమిచ్చారు. ‘రోస్టర్‌పై సంపూర్ణాధికారం సీజేఐదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ధర్మాసనాలను ఏర్పాటుచేయటం సీజేఐకి ఉన్న అధికారం. అయితే ఇది అధికారాన్ని అనుభవించేందుకు మాత్రమే కాదు. ప్రజా సమస్యలకు సరైన పరిష్కారాలిచ్చేందుకు కూడా దోహదపడాలి. అలాగని అభిశంసన సరైన సమాధానం కాదు. పరిష్కారం వెతకాలి కానీ.. తొలగింపు సరికాదు’ అని చలమేశ్వర్ తెలిపారు. జనవరి 12న ప్రెస్‌మీట్ పెట్టి సీజేఐపై బహిరంగ విమర్శలు చేసిన నలుగురిలో జస్టిస్ చలమేశ్వర్ ఒకరన్న విషయం విదితమే. హార్వర్డ్ క్లబ్ ఆఫ్ ఇండియా (అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన భారతీయులు ఏర్పాటుచేసుకున్న క్లబ్) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్.. జస్టిస్ చలమేశ్వర్‌కు కొంతకాలంగా న్యాయవ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే ‘ప్రభుత్వానికి మేలు చేసే ఉద్దేశంతోనే సీజేఐ ధర్మాసనాలను ఏర్పాటుచేస్తున్నారా? తను కోరుకున్న తీర్పులు ఇప్పించుకునేందుకే సీజేఐ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా?’ అనే ప్రశ్నలపై స్పందించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు. ‘జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై వెల్లడించిన తీర్పులోనూ మేం (జస్టిస్ గొగోయ్‌తో కలిసి).. వ్యవస్థను సరైన దార్లో పెట్టాల్సిన మెకానిజం గురించే పేర్కొన్నాం’ అని అన్నారు. కొలీజియంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సీజేఐతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్న వ్యాఖ్యలపై చలమేశ్వర్ విభేదించారు. ‘మేం మా వ్యక్తిగత ఆస్తుల కోసం పోరాడటం లేదు. సంస్థాగత అంశాలపైనే భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నాం. దీనర్థం మేం ఒకరినొకరం విమర్శించుకుంటామని కాదు’ అని తెలిపారు. జూన్ 22న తన రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పదవులూ ఆశించటం లేదన్నారు. విపక్ష పార్టీలు అభిశంసనకోసం సంతకాల సేకరణ చేపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చలమేశ్వర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఒవైసీ వ్యాఖ్యల్ని ఖండించిన ఎంపీ అసెంబ్లీ
భోపాల్ : తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేదిలేదన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఖండించింది. ఆయనపై ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితు పట్వారీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఒవైసీ వైఖరిని ఖండించిన ఆయన తమ పార్టీ అన్ని రకాల మతవాద భావజాలాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒవైసీలో ఇటువంటి భావజాలం మంచిది కాదని, సర్వ మతాల సంగమంగా ఉన్న దేశాన్ని 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'గా తొలి ప్రధాని నెహ్రూ రూపుదిద్దారని ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర శాసన వ్యవహారాల మంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ ఒవైసీలో ఇటువంటి జాతి వ్యతిరేక మనస్తత్వాన్ని ఏడాదిన్నరగా గమనిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలువురు సభ్యులు ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కాంగ్రెస్, బీజేపీ సభ్యులమధ్య విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గందరగోళం మధ్యే అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.