ప్రజానుకూల విధానాలు అనుసరించని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్ మినహా పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇందుకు 2019 ఎన్నికలు సమీపిస్తూండటం ఒక కారణం కాగా, బీజేపీ బలహీనపడుతూండటం కూడా మరొక కారణం. గత నాలుగేళ్ళుగా బీజేపీ, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా, ప్రజా వ్యతిరేక పాలననే కొనసాగించింది. అంతేగాక, మేధావులపైనా, ప్రజాస్వామికవాదులపైనా, దళి తులు, మైనార్టీలపైనా హత్యలు, దాడులు బీజేపీ పాలనలో పెచ్చు పెరిగిపోయాయి. పాలకవర్గాల్లో అసహనం, ప్రజల్లో అభద్రత పెరిగాయి. కనుక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం మరింతగా పెరిగింది. అయితే, ఏది ప్రత్యామ్నాయం, అనేదే కీలకమైన ప్రశ్న.
ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయస్థాయి మహాసభలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడం. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నిటితో కలిపి కూటమి ఏర్పడాలనే విధానం సీపీఐలో ఇప్పటికే స్పష్టంగానే వుంది. అంటే, కాంగ్రెస్‌ను కూడా కలుపుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయ సారాంశం.
అయితే సీపీఎం విధానం అంత సూటిగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ విధానం అటూ ఇటూ మారుతూ వస్తోంది. 1964 నాటి పార్టీ చీలికకు ఆనాటి సీపీఐ నాయకత్వం చేపట్టిన కాంగ్రెస్ అనుకూల పోకడే ప్రధాన కారణం అని సీపీయం నాయకత్వం ఆనాడు స్పష్టంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏ ప్రజాస్వామిక, ఆర్థిక, సామాజిక విధానాలపరమైన వ్యత్యాసాల కారణంగా 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీడీపీని బలపరిచిందో, ఆ పార్టీ నాయకత్వమే చెప్పాలి.
ప్రస్తుతం ప్రతిపాదిస్తోన్న బీజేపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ స్థానం ఏమిటి, అన్నది ముఖ్యమైన అంశంగా సీపీఎంలో చర్చ జరుగుతూండటం బహిరంగ రహస్యమే. వాస్తవానికి 1964 నాటి చీలిక ప్రకారం రెండు పార్టీలు, సీపీఐ, సీపీఎంలుగా కొనసాగాలంటే కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల విధానాల ప్రాతిపదిక ఉండితీరాలి. ఆ ప్రాతిపదికే లేకపోతే అప్పుడు పార్టీని చీల్చడమే తప్పు; ఇప్పుడు రెండు పార్టీలుగా కొనసాగడం అంతకన్నా తప్పు. నేటి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండబట్టేనేమో, సీపీఐ నాయకత్వం రెండు పార్టీల విలీనాన్ని పదేపదే బలంగా ప్రతిపాదిస్తూ వస్తోంది. ఆ ప్రతిపాదనను సీపీయం నాయకత్వం అదేపనిగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ తిరస్కరణకు సీపీఎం నాయకత్వం మనస్సులో ఏ కారణాలు పని చేస్తున్నాయో ప్రజలకైతే అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ పరిపాలన ఎంతటి జుగుప్సాకరంగా, అవినీతిమయంగా, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందో చెప్పటానికి ప్రబలమైన ప్రత్యక్ష సాక్ష్యం, 2014 ఎన్నికల్లో ప్రజలు పచ్చి మతోన్మాద బీజేపీని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టటమే. గతంలో వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, పదేళ్ల కాంగ్రెస్ యుపిఎ పరిపాలన అనంతరం నాలుగేళ్ల కిందట తిరిగి బిజెపి బహు పెద్ద మెజారిటీతో అధికార పీఠానికి ఎగబాకడం చూసిన తరువాత కూడా, మళ్ళీ కాంగ్రెస్‌తో కలిసిన ప్రత్యామ్నాయాల గురించి సీపీఐ, సీపీఎంలు ఆలోచించటం ఎంతటి ఆత్మవంచన? ఎంతటి ఆత్మహత్యా సదృశ్యం?
అసలు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? అది రాజకీయ విధాన ప్రత్యామ్నాయంగా వుండాలి. ఆ రాజకీయ విధానం అభివృద్ధికరమైన, మార్పు దిశగా నడిచే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన స్వభావంతో కూడుకుని ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలుగానీ, సీపీఐ, సీపీఎంలు ప్రతిపాదిస్తోన్న కూటమిలోని భాగస్వామ్య ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలు గానీ, ప్రజానుకూలంగా వున్నాయా? కనీసం ఆ సీపీఐ, సీపీఎంలు సమర్థించేవిగానైనా వున్నాయా? ప్రజానుకూల విధానాలు అనుసరిం చని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్‌ను మినహాయించి పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి.
బీజేపీ ఉగ్రవాద హిందుత్వ పార్టీకాగా, కాంగ్రెస్ తదితర పార్టీల్లో హెచ్చు భాగం ఉదారవాద హిందుత్వ పార్టీలే. తరతమ తేడాలేతప్ప స్వభావం మాత్రం ఒక్కటే. మరో ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ, ఏదో ఒక దశలో మతోన్మాద బీజేపీతో చెలిమి చేసినట్టివే. ఏవో తమ సొంత కారణాల వల్ల ఆ పార్టీకి ఈ పార్టీలు ప్రస్తుతం దూరంగా వుండవచ్చు. అంతమాత్రాన బీజేపీతో జతకట్టగలిగిన ఆ పార్టీల అలనాటి స్వభావం మారిందనుకోలేం. మారినట్లుగా దాఖలాలూ లేవు. ఇప్పుడు తాము ప్రతిపాదిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చదలచుకుంటోన్న ఒక్కొక్క పార్టీ గత చరిత్రను సీపీఐ., సీపీఎం.లు బహిరంగంగా ప్రకటించాలి. ఈ పార్టీలు బీజేపీ దగ్గరకు జరిగినా, లేక, దూరంగా వెళ్ళిపోయినా అవి తమ అప్పటి అవసరాల కోసం, అవకాశవాదంతో ఏర్పరచుకొన్న వైఖరే తప్ప, విధానపరమైన నిర్ణయాలు కావు. ఇలాంటి శక్తులతో కలసి నిజమైన బిజెపి వ్యతిరేక కూటమిని సీపీఐ, సీపీఎంలు నిర్మించడం సాధ్యమేనా?
సామాజిక న్యాయం, కుల వివక్షలను గురించి మాటల్లో చెప్పడం కాదు. అది చేతల్లో కనపడాలి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ రంగంలో స్పష్టంగా ప్రతిబింబించాలి. దినదినం క్షీణించిపోతున్న తమ ఉనికిని నిలబెట్టుకొని, బలపడి.. సామాజిక కులవర్గ దృక్పధంతో ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి కమ్యూనిస్టు పార్టీల మçహాసభలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొనడంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. నిజమైన కమ్యూనిస్టులుగా, నిజమైన సామాజిక రాజకీయ శక్తులతో కలిసి, నిజమైన ప్రత్యామ్నాయ, రాజకీయ శిబిరాన్ని నిర్మించడమా? లేక, బూటకపు లౌకిక శక్తులు, బూటకపు ప్రజాతంత్ర శక్తులతో జతకట్టి, బూట కపు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమా? ఇవే, సీపీఐ, సీపీఎం మహాసభల ముందున్న నిజమైన ప్రత్యామ్నాయాలు.
కొసమెరుపు : బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఫ్రంట్‌కు సీపీఎం అంగీకరించనున్నట్లు తాజా వార్తలు.
- ఇంటర్వ్యూ : జీకేఎం రావు, సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment