రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఐదేళ్లకు మించి ఏ పార్టీకి అధికారం ఇవ్వని రాజస్థాన్ ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేక కాంగ్రెస్‌కి మరోసారి అధికారం ఇచ్చి కొత్త సంప్రదాయానికి తెరతీస్తారా శనివారం జరగనున్న ఎన్నికల్లో తేలనుంది. ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సీపీ జోషి ఎమ్మెల్యేగా ఆరోసారి గెలుపుపై గురి పెట్టారు.
అత్యంత సీనియర్
కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన సీపీ జోషికి కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1998-2003లో రాజస్థాన్ మంత్రివర్గంలో పనిచేశారు. 2009లో భిల్వారా నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కూడా కొద్దికాలం పనిచేశారు.
స్పీకర్‌గా గుర్తింపు
2020లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా సీపీ జోషి వ్యవహరించిన పాత్ర చర్చనీయాంశమైంది. తిరుగుబాటుదారులపై అనర్హత నోటీసులు కూడా జారీ చేయడమే కాకుండా దీనిపై సుప్రీంకోర్టును సైతం ఆయన ఆశ్రయించారు.
విద్యావేత్త కూడా..
సీపీ జోషి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడే కాకుండా విద్యావేత్త కూడా. అర్హత కలిగిన న్యాయవాది అయిన ఆయన ఉదయపూర్‌లోని కళాశాలలలో సైకాలజీ బోధించేవారు.
1973లో మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం రాజకీయాలలో ఆయన తొలి అడుగు.
ఎమ్మెల్యేగా ఐదుసార్లు
సీపీ జోషి 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నాథ్‌ద్వారా నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2003-2005 మధ్య రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. నాథ్‌ద్వారా ఎన్నికల్లో ప్రముఖ మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు, బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్‌తోనూ ఆయన తలపడ్డారు.
ఒకే ఒక్క ఓటుతో..
2008 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సీపీ జోషి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై కేవలం ఒకే ఒక ఓటు తేడాతో సీటును కోల్పోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రచార కమిటీకి సారథ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీ జోషి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment