గుజరాత్‌లో మరో రాజకీయ గందరగోళం నెలకొంది. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి బీజేపీకి ప్రచారం సాగిస్తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, శంకర్ చౌదరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి తన ఫిర్యాదులో ఎన్నికల నియమావళి ప్రకారం రాజ్యాంగ పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీకీ ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. బనస్కాంత లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రేఖా చౌదరికి మద్దతుగా శంకర్ చౌదరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దోషి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లను కూడా విడుదల చేశారు.
పార్లమెంటరీ సంప్రదాయం, ప్రొసీజర్ పార్ట్-1లోని అధ్యాయం-9లోని సూత్రాలను చౌదరి ఉల్లంఘించారని, 2024 పార్లమెంటు ఎన్నికలకు ఆయన ప్రచారం చేయకుండా తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని మనీష్ దోషి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ యగ్నేష్ దవే స్పందిస్తూ ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్ మాత్రమేనని అన్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశలో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment