గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని, ఆ పార్టీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఇక.. నామినేషన్ తిరస్కరణ అనంతరం సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని కనిపించకుండా పోయారు. ఫోన్‌లో కూడా ఆయన అందుబాటులో లేరని స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. తాజాగా శనివారం ఆయన దాదాపు 20 రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. తాను ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి గల కారణాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్, రాజ్‌కోట్ లోక్‌సభ అభ్యర్థి పరేష్ ధనాని పట్ల గౌరవంతోనే తాను స్పందించలేదని తెలిపారు.
‘నేను ద్రోహం చేశానని కాంగ్రెస్ నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఏదిఏమైమనా కాంగ్రెస్ తొలిసారి నాకు 2017లోనే ద్రోహం చేసింది. చివరి క్షణంలోని సూరత్‌లోని కామ్‌రేజ్ అసెంబ్లీ టికెట్‌ను క్యాన్సల్ చేసింది. కాంగ్రెస్ నాకు మొదటి మోసం చేసింది... నేను చేయలేదు’ అని నీలేష్ కుంభాని అన్నారు.
‘నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడిని కాదు. కానీ, నా మద్దతుదారులు, అభిమానులు, ఆఫీసు స్టాఫ్, వర్కర్లు అంతా మనస్తాపనికి గురయ్యారు. ఎందుకుంటే కేవలం ఒక ఐదుగురు నేతలు సూరత్‌లో వారు పనిచేయకుండా.. వేరేవాళ్లను కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్, ఆప్ కూటమిలో భాగంగా.. నేను ఆప్ నేతల తరఫున ప్రచారం చేస్తే నన్ను సదరు నేతలు వ్యతిరేకించారు’ అని నీలేష్ కుంభాని తెలిపారు.
నామినేషన్ తిరస్కరణ అనంతరం ఏప్రిల్ 22 నుంచి నీలేశ్ కుంభాని కనిపించకుండా పోయారు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. నీలేష్ కుంభాని బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. గుజరాత్‌లో ఒకేదశలో 26 పార్లమెంట్ స్థానాలకు మే 7న పోలింగ్ జరిగింది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment