ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ
అసెంబ్లీ కార్యదర్శికి, సీఈసీకి, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు
కౌంటర్ దాఖలుకు సీజే ధర్మాసనం ఆదేశం
ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఆదేశాలివ్వాలన్న కేఏ పాల్ విజ్ఞప్తికి నో
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర ప్రతివాదులు కూడా స్పందించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా, జీతభత్యాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారని.. ఇలాంటి వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం ద్వారా ఆయా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇలాంటి వారంతా ఐదేళ్ల పాటు యథేచ్ఛగా తమ అధికారాలను అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి వారిపై వెంటనే అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు.
అయితే ఇదే అంశంపై అప్పటికే సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో రిజిస్ట్రీ అభ్యంతరం తెలుపుతూ పిల్‌కు నంబర్ కేటాయించలేదు. కానీ గత విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీని అందజేయడంతో నంబర్ కేటాయించాలని సీజే ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ఈ పిల్‌పై సోమవారం విచారణ చేపట్టింది.
సింగిల్ జడ్జి ఏమన్నారు..
సింగిల్ జడ్జి వద్ద దాఖలైన పిటిషన్లలో ఈ నెల 9న తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ చెప్పేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని.. ఆలోగా వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని స్పీకర్ కార్యదర్శికి జడ్జి తేల్చిచెప్పారు.
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, విచారణ షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేశారు. దీని వివరాలను రిజి్రస్టార్ (జ్యుడిషియల్)కు అందజేయాలని చెబుతూ కీలక తీర్పు వెలువరించారు. ఈ తీర్పు వెలువడి ఇప్పటికి రెండు వారాల సమయం గడిచింది.
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం..
పార్టీ ఇన్ పర్సన్ కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఒక్కోసారి సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు పడుతోంది. ప్రతివాదులైన 10 మంది (దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి.
అలాగే జీతభత్యాలు కూడా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ మధ్యంతర ఉత్తర్వుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment