అప్పీళ్లు దాఖలు చేసే అర్హత ఆయనకు లేదు..సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయలేరు
‘అనర్హత’పై హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాదనలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించారు. స్పీకర్ ముందు అనర్హత పిటిషన్లు ఉంచడం పబ్లిక్ సర్వెంట్‌గా ఆయన విధి అని, ఎలాంటి అర్హత లేకుండా వేసిన అప్పీళ్లు చెల్లవని చెప్పారు. అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సింది స్పీకర్ అని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయడమో లేదో తేల్చుకోవాల్సింది ఆయనేనని స్పష్టం చేశారు.
చట్టవిరుద్ధంగా అసెంబ్లీ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయలేరని పేర్కొన్నారు. అధికారాలను అనుభవిస్తూ.. విధులను మాత్రం నిర్వహించను అనడం సహించరానిదని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.
అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
8 నెలలు కావొస్తున్నా ఏ నిర్ణయం లేదు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న వాదన చట్టబద్ధమే. కైశమ్ మేఘచంద్ర సింగ్ కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. మూడు నెలల గడువులోగా స్పీకర్ తన ముందున్న పిటిషన్లను పరిష్కరించాలి. శాసనసభ కాలపరిమితి పూర్తయ్యే ఐదేళ్ల వరకు స్పీకర్ వేచిచూస్తూ ఉంటే కోర్టులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళితే అవకాశం ఇవ్వలేదు.
కార్యాలయంలో పిటిషన్లు తీసుకోలేదు. విధిలేని పరిస్థితిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసి దాదాపు 8 నెలలు కావొస్తున్నా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేయాలి..’అని కోరారు. అంతకుముందు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment