రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి
న్యూఢిల్లీ: స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎప్పుడూ ఊహించలేనిదని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పేర్కొన్నారు. ఇది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఈనెల 24వరకు తనను నిరోధిస్తూ రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో(చట్టసభ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి) న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్ అధికారాలను తగ్గించి వేయడమే అవుతుందన్నారు.
స్పీకర్ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ
అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జూలై 23న విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో దీన్ని చేర్చింది. ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
స్పీకర్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు
రాజస్తాన్ శాసన సభ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తన వాదన, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. జోషి పిటిషన్‌పై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, తమ వాదన సైతం వినాలని సచిన్ పైలట్ కోరుతున్నారు.
తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పు
బీజేపీలో చేరాలంటూ తనకు రూ.కోట్లు ఎర చూపారని సంచలన ఆరోపణలు చేసిన రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మాలింగకు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం తన అడ్వొకేట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మాలింగ అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ప్రసార మాధ్యమాల సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఒక రూపాయి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్‌లో సచిన్ పైలట్ నివాసంలోనే తనను ప్రలోభాలకు గురి చేశారని గిరిరాజ్‌సింగ్ మాలింగ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 7 నెలలుగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మాలింగ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ క్యాంపులో ఉన్నారు. సచిన్ పైలట్ నుంచి తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసు రాలేదని, దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని మాలింగ చెప్పారు.
మోదీకి గహ్లోత్ లేఖ
మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం గహ్లోత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. ‘ఇదంతా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, కొందరు మమ్మిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకోవడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనుచిత ఘటనలే చోటుచేసుకున్నాయని అశోక్ గహ్లోత్ గుర్తుచేశారు.
గహ్లోత్ సోదరుడి నివాసాలపై ఈడీ దాడులు
2007–09 నాటి ఎరువుల కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు, విత్తనాలు, ఎరువుల సంస్థ ‘అనుపమ్ కృషి’ వ్యవస్థాపకుడు అగ్రసేన్ గహ్లోత్ నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బధవారం దాడులు నిర్వహించింది. అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జోద్‌పూర్ జిల్లాలోని మాందోర్ ప్రాంతంలో ఉన్న అగ్రసేన్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల రక్షణ మధ్య ఈ సోదాలు జరిగాయి.
అగ్రసేన్‌తో సంబంధాలున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ నివాసం, ఇద్దరు రాజస్తాన్ కాంగ్రెస్ నాయకులు, మరో వ్యాపార సంస్థపైనా ఈడీ దాడులు జరిగాయి. రాజస్తాన్‌లో 6 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్‌లో 2, గుజరాత్‌లో 4, ఢిల్లీలో ఒక ప్రాంతంలో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాజస్తాన్‌లో 2007– 09లో మారియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ)ను రైతులపై రాయితీపై సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, రూ.60 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఫిర్యాదు మేరకు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద(పీఎంఎల్‌ఏ) కేసు నమోదైంది.
దాడులతో బెదిరించలేరు: సూర్జేవాలా
మోదీ దేశంలో దాడుల రాజ్యం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం మండిపడ్డారు. ఈ దాడులకు తమ పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలు బీజేపీలో పన్నిన ఉచ్చులో చిక్కుకోలేదని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి నివాసంపై దాడులు ప్రారంభించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment