constitutional crisis
-
మళ్లీ నేపాల్‌లో అస్థిరత
నిరంతరం సంక్షోభం నుంచి సంక్షోభానికి పయనించడం అలవాటైన నేపాల్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం హఠాత్తుగా 275మంది సభ్యులుండే పార్లమెంటు దిగువ సభను రద్దు చేశారు. పాలకపక్షం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్)లో గత కొన్నినెలలుగా పుట్టిన ముసలం కారణంగా ప్రతినిధుల సభకు ఇంకా ఏడాది గడువుండగానే ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఓలి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో ఓలి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ...అంటే 174మంది సభ్యుల మద్దతు వుంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆదర్శనీయంగా రెండేళ్లక్రితం ఓలి నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్టు సెంటర్)లు విలీనమై సీపీఎన్గా ఏర్పడ్డాయి. అయితే కలిశాయన్న మాటేగానీ ఆ రెండు సంస్థలూ రెండు వర్గాలుగా పనిచేస్తున్నాయి. అయిదేళ్లక్రితం ఆమోదం పొంది గణతంత్ర నేపాల్ ఆవిర్భావానికి మూలకారణమైన రాజ్యాంగం ఇలా అర్థాంతరంగా పార్లమెంటు రద్దు చేయడాన్ని అంగీకరిస్తుందా లేదా అన్న అంశంలో వాదోపవాదాలు సాగుతున్నాయి. పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో డజను పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీల విలీనంలోనే వివాదం బీజాలున్నాయి. విలీనం సందర్భంగా కుదిరిన ఒప్పందం ఇటీవలికాలం వరకూ రహస్యంగానే వుండిపోయింది. ఓలి, ప్రచండలిద్దరికీ, పార్టీలో మరికొందరికీ మాత్రమే దాని వివరాలు తెలుసు. అందులో ఇద్దరూ చెరిసగం కాలం పాలించాలన్న షరతుంది. సింహాసనం అధిరోహించాక ఓలి దాన్ని మరిచిపోవడమే తాజా వివాదానికి దారితీసింది. భిన్న పార్టీలైనా, సంస్థలైనా విలీనం కావడానికి అనేక కారణాలుంటాయి. ఐక్య సంఘటనగా కలిసి పనిచేస్తున్న క్రమంలో వాటిమధ్య ఏర్పడే సదవగాహన...ఒకే రకమైన సిద్ధాంతాలు లేదా ఆశయాలు వున్నాయన్న అభిప్రాయం...ఉమ్మడిగా సాధించాల్సింది ఎంతోవుందన్న భావన –ఇలా ఏదో ఒక ప్రేరణ వున్నప్పుడే ఏ విలీనమైనా సహేతుకమైనదవుతుంది. కానీ స్వప్రయోజనాలే పరమార్థం అయినప్పుడు పేరుకు విలీనం జరిగినా అది కాస్తా ప్రహసప్రాయంగా మిగులుతుంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీల కలయిక చివరి బాపతేనని గత కొన్ని నెలల పరిణామాలు చెబుతున్నాయి. ఒప్పందంలోని షరతు బేఖాతరు చేశాక సీపీఎన్లో రాజుకున్న మంటలు చూసి ఓలి మొదట్లో బెంబేలెత్తారు. రాజీ బేరాలు సాగించారు. సీనియర్లతో చర్చోపచర్చలు సాగించి పార్టీ కార్యనిర్వహణాధికారాలను ప్రచండకు కట్టబెట్టడానికి సమ్మతించారు. అది మొదట్లో కొన్నాళ్లు పనిచేసింది. ప్రచండ పార్టీ చైర్మన్ అయ్యారు. కానీ త్వరలోనే ఆయనకు అంతా అర్థమైంది. పార్టీ స్థాయీ సంఘాన్ని సంప్రదించకుండా మంత్రులు, విదేశాలకు రాయబారులు తదితరుల్ని నియమిస్తూ ఓలి తనను నామమాత్రం చేశారని, ప్రభుత్వంతోపాటు పార్టీపై కూడా ఆయన పట్టే సాగుతోందని గుర్తించారు. మళ్లీ ప్రచండలో అసంతృప్తి మొదలైంది. దాన్ని చల్లార్చడానికి మరో మంచి పదవి అప్పగిస్తానని ఓలి ఊరించారు. కానీ పాలనా పగ్గాలు అప్పజెప్పడం మినహా తనకు మరేదీ సమ్మతం కాదని ఆయన హఠాయించారు. పేచీ సద్దుమణగకపోవడంతో కొంతకాలంగా ఓలి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని కొన్ని రోజులుగా ఆయన హెచ్చరిస్తున్నారు. తాజా నిర్ణయంతో అదేమిటో అందరికీ అర్థమైంది. ఓలి, ప్రచండల మధ్య మౌలికంగా చాలా వ్యత్యాసాలున్నాయి. నేపాల్‌లో హిందూ రాజరిక వ్యవస్థ వున్న కాలంలో అమలైన పార్టీ రహిత పంచాయతీ విధానానికి వ్యతిరేకంగా అరవయ్యో దశకంలోనే ఉద్యమం సాగించి కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఓలి పార్లమెంటరీ రాజకీయాల్లో ఆరితేరారు. కానీ ప్రచండ ఇందుకు భిన్నం. ఆయన అజ్ఞాతంలో పనిచేసే కమ్యూనిస్టు పార్టీలో 1981లో చేరి, సాయుధ పోరాట రాజకీయాల్లో తలమునకలయ్యారు. అందుకే కావొచ్చు... రాజకీయ ఎత్తుగడల్లో ఓలితో పోలిస్తే ప్రచండ వెనకబడివున్నట్టు కనబడతారు. పార్టీలో కీలక నాయకులనదగ్గవారు ప్రచండతోనే వున్నారు. అందుకే ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని చెప్పినప్పుడు ఆయన పార్టీని చీలుస్తాడని ...ఆయనతో పార్టీనుంచి వైదొలగేవారు వుండరుగనుక ఓలి విఫలమవుతారని ప్రచండ వర్గం సీనియర్ నేతలు భావించారు. పార్టీ చీలికపై వున్న చట్ట నిబంధనలను మొన్న ఏప్రిల్‌లో మారుస్తూ ఓలి ఆర్డినెన్సు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆ అంచనాకు కారణం కావొచ్చు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో దాన్ని విరమించుకున్నా, ఓలి అసలు ఆంతర్యం పార్లమెంటు రద్దని ఇప్పుడు వారికి తెలిసొచ్చింది. ఓలి తాజా నిర్ణయంపై సుప్రీంకోర్టు ఏమంటుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. 76వ అధికరణ ప్రకారం ఒక ప్రభుత్వం కుప్పకూలినప్పుడు అప్పుడుండే పార్లమెంటుద్వారా తదుపరి ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యమని తేలాకే దాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి. పాలకపక్షానికి మూడింట రెండొంతుల మెజారిటీ వుండగా పార్లమెంటును ఎలా రద్దు చేస్తారన్నదే ప్రశ్న. పాలకపార్టీ నేతలు పరస్పరం కుమ్ములాడుకుంటూ మధ్యలో పార్లమెంటుపై దాడి చేయడం సరికాదని విపక్షాలు అంటున్నాయి. నేపాల్ రాజకీయాలు మొదటినుంచీ పొరుగునున్న రెండు పెద్ద దేశాలు చైనా, భారత్‌లతో ముడిపడివుంటున్నాయి. ఓలి, ప్రచండలిద్దరూ చైనాకు సన్నిహితులే. అందుకే వారి మధ్య రాజీ కుదిర్చేందుకు చైనా లోపాయికారీగా కష్టపడింది. కానీ ఆ మధ్యవర్తిత్వం తనకు అనుకూలంగా వుండదనుకున్నారో, ఏమోగానీ ఓలి ఇటీవల మన దేశానికి దగ్గరయ్యారు. గత నెలలో మన విదేశాంగ కార్యదర్శి ఆ దేశం పర్యటించారు. భూకంప వైపరీత్యంనుంచి అయిదేళ్లయినా కోలుకోని నేపాల్ కరోనా మహమ్మారితో మరింత సంక్షోభంలో పడింది. ఇలాంటి సమయంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి. -
అనర్హతపై కోర్టు జోక్యమా?
న్యూఢిల్లీ: స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎప్పుడూ ఊహించలేనిదని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పేర్కొన్నారు. ఇది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఈనెల 24వరకు తనను నిరోధిస్తూ రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో(చట్టసభ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి) న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్ అధికారాలను తగ్గించి వేయడమే అవుతుందన్నారు. స్పీకర్ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జూలై 23న విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో దీన్ని చేర్చింది. ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. స్పీకర్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు రాజస్తాన్ శాసన సభ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తన వాదన, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. జోషి పిటిషన్‌పై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, తమ వాదన సైతం వినాలని సచిన్ పైలట్ కోరుతున్నారు. తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పు బీజేపీలో చేరాలంటూ తనకు రూ.కోట్లు ఎర చూపారని సంచలన ఆరోపణలు చేసిన రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మాలింగకు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం తన అడ్వొకేట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మాలింగ అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ప్రసార మాధ్యమాల సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఒక రూపాయి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో సచిన్ పైలట్ నివాసంలోనే తనను ప్రలోభాలకు గురి చేశారని గిరిరాజ్‌సింగ్ మాలింగ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 7 నెలలుగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మాలింగ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ క్యాంపులో ఉన్నారు. సచిన్ పైలట్ నుంచి తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసు రాలేదని, దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని మాలింగ చెప్పారు. మోదీకి గహ్లోత్ లేఖ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం గహ్లోత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. ‘ఇదంతా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, కొందరు మమ్మిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకోవడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనుచిత ఘటనలే చోటుచేసుకున్నాయని అశోక్ గహ్లోత్ గుర్తుచేశారు. గహ్లోత్ సోదరుడి నివాసాలపై ఈడీ దాడులు 2007–09 నాటి ఎరువుల కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు, విత్తనాలు, ఎరువుల సంస్థ ‘అనుపమ్ కృషి’ వ్యవస్థాపకుడు అగ్రసేన్ గహ్లోత్ నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బధవారం దాడులు నిర్వహించింది. అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జోద్పూర్ జిల్లాలోని మాందోర్ ప్రాంతంలో ఉన్న అగ్రసేన్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్ల రక్షణ మధ్య ఈ సోదాలు జరిగాయి. అగ్రసేన్తో సంబంధాలున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ నివాసం, ఇద్దరు రాజస్తాన్ కాంగ్రెస్ నాయకులు, మరో వ్యాపార సంస్థపైనా ఈడీ దాడులు జరిగాయి. రాజస్తాన్‌లో 6 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లో 2, గుజరాత్లో 4, ఢిల్లీలో ఒక ప్రాంతంలో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాజస్తాన్‌లో 2007– 09లో మారియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ)ను రైతులపై రాయితీపై సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, రూ.60 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఫిర్యాదు మేరకు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద(పీఎంఎల్ఏ) కేసు నమోదైంది. దాడులతో బెదిరించలేరు: సూర్జేవాలా మోదీ దేశంలో దాడుల రాజ్యం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం మండిపడ్డారు. ఈ దాడులకు తమ పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలు బీజేపీలో పన్నిన ఉచ్చులో చిక్కుకోలేదని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి నివాసంపై దాడులు ప్రారంభించారని ఆరోపించారు. -
కేజ్రీకి సీఎంల సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ) తీరుపై నిరసన తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నలుగురు ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆదివారం నాటి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారమే ఢిల్లీ చేరుకున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంపై సత్వరమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు తమ సమ్మెను విరమించాలని, పేదలకు ఇంటివద్దకే రేషన్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలనే ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలోని సందర్శకుల గదిలో గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ ఎల్జీని కోరారు. ఆయన అనుమతించకపోవడంతో.. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆ నలుగురు ఏపీ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానిపై మండిపడ్డ సీఎంలు దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యనే పరిష్కరించలేని వారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వచ్చాను. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. విపక్ష పార్టీలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వంపై ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో సమస్య ఇలా ఉంటే ఎలా? దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల భవిష్యత్తు ఏమవుతుంది? ఎల్జీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలి. అది స్వపక్షమా? విపక్షమా? అని చూడరాదు. ఒక సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి వీలుకానప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘మేం కేజ్రీవాల్‌ను కలవాలనుకున్నాం. ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కల్పించాలి. అంతిమంగా మా డిమాండ్ ఒక్కటే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వాలి. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజలకు సేవ చేయగలం’ అని పేర్కొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంకు మద్దతు తెలిపేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చాం. ఢిల్లీ దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ‘కేంద్రం వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. కేజ్రీవాల్‌కు మా మద్దతుంటుంది’ అని విజయన్ పేర్కొన్నారు. మండిపడ్డ కేజ్రీవాల్ సీఎంల వినతిని ఎల్జీ తిరస్కరించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటారనుకోను. కచ్చితంగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక సీఎంను.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడాన్ని ప్రధాని అడ్డుకోగలరా? రాజ్ నివాస్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజలది. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. శనివారం ఏం జరిగింది? పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదట ఆంధ్రా భవన్లో సమావేశమమయ్యారు. కేజ్రీవాల్‌కు మద్దతును సమీకరించేందుకు కావాల్సిన ప్రయత్నాలపై చర్చించారు. అనంతరం రాజ్ నివాస్ (లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం, కార్యాలయం)లో నిరసన చెబుతున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎల్జీ బైజాల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతివ్వబోనని ఎల్జీ స్పష్టంచేశారు. తర్వాత వీరంతా కేజ్రీవాల్ నివాసంలో కుటుంబ సభ్యులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. అప్పుడు ఏమయ్యారు: బీజేపీ నలుగురు సీఎంలు కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపడంపై బీజేపీ మండిపడింది. ‘కేజ్రీవాల్ నివాసంలో, ఆయన సమక్షంలోనే సీఎస్ అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగింది. అప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు? ఆ నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు కూడా అన్షు ప్రకాశ్‌కు సంఘీభావంగా ముందుకు వస్తే వీళ్లేం చేస్తారు?’ అని బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ ప్రశ్నించారు. -
'కావేరిపై కర్ణాటక చెప్పేదంతా అబద్ధం'
చెన్నై: కర్ణాటక రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోందని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అన్నారు. శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థ మధ్య తగాదాను పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కావేరీ జలాల సమస్య అంశం ద్వారా గట్టి పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తన వద్ద నీళ్లు లేవని కర్ణాటక చెప్పేదంతా కూడా ఓ అబద్ధం అని ఆయన మండిపడ్డారు. ఆదేశాల ప్రకారం 23 వరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు నీళ్లు తమిళనాడుకు ఇవ్వకుండా కర్ణాటక ఆపేయడం సుప్రీంకోర్టును అవమానించడమే అని అన్నారు. ఇదొక్కటే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీళ్లు ఇవ్వడం కుదరదని తీర్మానం చేసేందుకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తోందని అన్నారు. ఆయన ఆలోచన ప్రకారం కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదొక రాజకీయ-చట్టపరమైన సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. సెప్టెంబర్ 27న కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రోజు తమ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించిన తీర్మానం సుప్రీంకోర్టులో ఉంచాలని చూస్తోందన్నారు. దానిని కోర్టు వ్యతిరేకిస్తే అది కాస్త న్యాయ వ్యవస్థకు, శాసన సభకు మధ్య ఘర్షణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, రేపు కావేరి జలాల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చర్చించే విషయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే గవర్నర్ ను కలిసి అనుమతి కలిశారు.