జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ సర్కార్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్త ఎమ్మెల్యేలకు జారీచేసిన అనర్హత పిటిషన్‌లపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రక్రియను వాయిదా వేయాలని ఈనెల 21న రాజస్ధాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ స్పీకర్ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
రాజస్తాన్ హైకోర్టు ఈనెల 24న యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశిస్తూ జారీ చేసిన సమగ్ర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ప్రస్తావించినందున ఈ పిటిషన్‌ను ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ను స్పీకర్ సీపీ జోషీ కోరారు. జోషీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వినతి మేరకు పిటిషన్ ఉపసంహరణకు అనుమతించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించింది.
మరోవైపు రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు పంపిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చారు. కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment