జోషి, రుచిర్, లలిత్ మోదీ
జైపూర్: విదేశాల్లో ఉంటూనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో చక్రం తిప్పాలనుకున్న లలిత్ మోదీకి చుక్కెదురైంది. ఆర్సీఏ అధ్యక్షుడిగా పోటీచేసిన లలిత్ తనయుడు రుచిర్ మోదీ ఓటమిపాలయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్సీఏ ఎన్నికల ఫలితాల్లో.. మోదీ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సీపీ జోషి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19 ఓట్లు సాధించగా, రుచిర్ మోదీకి కేవలం 14 ఓట్లు మాత్రమే పొలయ్యాయి. అయితే ఆర్సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం మోదీ అనునాయులకే దక్కడం గమనార్హం. సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రజరర్‌గా పింకేశ్‌జైన్‌లు ఎన్నికయ్యారు. ఐపీఎల్‌లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన లలిత్ మోదీ అరెస్ట్ భయంతో కొన్నేళ్ళ కిందటే భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచివెళ్లే క్రమంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు సహకరించారనే ఆరోపణలున్నాయి.