దేశవాళీ సీజన్ నుంచి రాజస్థాన్ అవుట్!
ముంబై: తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్షుడిగా లలిత్ మోడిని ఎన్నుకున్నందుకు బీసీసీఐ తగిన చర్యలకు దిగినట్టే కనిపిస్తోంది. వచ్చే దేశవాళీ సీజన్ షెడ్యూల్‌లో ఆర్‌సీఏను పేర్కొనలేదు. అండర్-16, 19, 23, రంజీ ట్రోఫీ, మహిళల టోర్నీ పోటీల వివరాలతో కూడిన హ్యాండ్‌బుక్‌ను బోర్డు అన్ని గుర్తింపు సంఘాలకు పంపిణీ చేసింది. అయితే ఇందులో రాజస్థాన్ ఊసు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివిధ అంశాలపై ఆర్‌సీఏతో బీసీసీఐకి విబేధాలున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీఏను దేశవాళీ సీజన్ నుంచి మేం తొలగించలేదు.
వారి కోసం స్లాట్‌ను ఉంచాం. ప్రభుత్వ, బోర్డు అంతర్గత నిర్ణయాలపై ఆధారపడి ఏ విషయాన్నీ ఖరారు చేస్తాం. రాజస్థాన్ ఆటగాళ్లతో పాటు అందరూ ఆడాలనే కోరుకుంటున్నాం. అన్ని సమస్యలు పరిష్కారమై సీజన్‌లో అన్ని రాష్ట్రాలు ఆడతాయనే ఆశిస్తున్నాను’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఇంటర్ స్టేట్ జూనియర్ క్రికెట్ టోర్నీకి ముందు ఆర్‌సీఏపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బీసీసీఐ హ్యాండ్‌బుక్‌ను తామింకా చూడలేదని ఆర్‌సీఏ ఉపాధ్యక్షుడు మెహమూద్ అబ్ది పేర్కొన్నారు.
క్రికెట్ కార్యకలాపాలకు బింద్రా దూరం
చండీగఢ్: 36 ఏళ్లుగా క్రికెట్ పాలనాధికారిగా సేవలందిస్తున్న ఇందర్‌జిత్ సింగ్ బింద్రా ఇక విశ్రాంతి తీసుకోనున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. బింద్రా స్థానంలో డీపీ రెడ్డిని నియమించారు. పీసీఏ రోజువారీ వ్యవహారాలను చూడలేకపోతున్నందుకు తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని బింద్రా కోరారు.