ఎక్కడ చెడింది?
‘మోదీగేట్’లో వసుంధర రాజే పేరు తెరపైకి రావడం వెనుక కథ!
‘మోదీగేట్’లో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే పేరు హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక పెద్ద కథే ఉంది. లలిత్ మోదీ బ్రిటన్
ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు మాట సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరే మొదట తెరపైకి వచ్చింది. కానీ హఠాత్తుగా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ల పేర్లు, లలిత్‌తో వారి సాన్నిహిత్యం పతాక శీర్షికలకెక్కాయి. ‘మోదీగేట్’లో రాజే పాత్రను వెల్లడి చేసింది స్వయంగా లలితే. బీసీసీఐలో లలిత్ ప్రస్థానానికి సంపూర్ణ సాయం చేసింది రాజేనే.
ఆమె మద్దతుతోనే.. రాజస్తాన్ క్రికెట్ సంఘం నుంచి ప్రారంభించి, బీసీసీఐని శాసించే స్థాయికి లలిత్ ఎదిగారు. ఐపీఎల్ ఆయన బ్రెయిన్ చైల్డే. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ కూడా లలితే. ఐపీఎల్‌తో తారస్థాయికి చేరి.. అదే ఐపీఎల్‌లో అవకతవకలకు పాల్పడి అధఃపాతాళానికి చేరాడు. - సెంట్రల్ డెస్క్
లలిత్ వెనుక రాజే..
2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో అప్పటివరకు ఎవరికీ అంతగా తెలియని లలిత్ మోదీ.. అప్పటికే 40 ఏళ్లుగా రాజస్తాన్ క్రికెట్‌ను శాసిస్తున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను ఓడించాడు. లలిత్ విజయం వెనుక, తెరవెనుక కృషి అంతా అప్పుడు కూడా సీఎంగా ఉన్న రాజేదే. రాజస్తాన్‌లోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు, వ్యక్తిగత సభ్యులు అంతా రుంగ్తా కుటుంబానికి విశ్వాసపాత్రులే.
దాంతో సీఎంగా అధికారాన్ని ఉపయోగించిన రాజే జిల్లా క్రికెట్ సంఘాలను బెదరించి, రిగ్గింగ్ జరిపి లలిత్ గెలుపునకు బాటలు వేశారని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత సభ్యులు కిషోర్త్‌కు ఓటేయకుండా వారికి ఓటు హక్కుల్ని తొలగిస్తూ ఆర్డినెన్సునే జారీ చేశారు. రాజే కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో లలిత్.. రాజస్తాన్ సూపర్ సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలూ వచ్చాయి.
వ్యాపార సంబంధాలు..
2007లో.. రాజస్తాన్ ప్రభుత్వం సీఎం వసుంధర రాజే కూడా ఒక ప్రమోటర్‌గా అంబర్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీని ప్రారంభించింది. ఆ అథారిటీ పురాతత్వ ప్రాముఖ్యమున్న, 2 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు హవేలీలు.. చాబ్రోంకి హవేలీ(466 గజాలు), బైరాతియోంకి హవేలీ(1,463 గజాలు)లను అంబర్ హెరిటేజ్ సిటీ కన్‌స్ట్రక్షన్ సంస్థకు కారుచవకగా అమ్మేసింది. చాబ్రోంకిని రూ. 9 లక్షలకు, బైరాంకిని రూ. 21 లక్షలకు అమ్మేసింది. ఆ తరువాత ఆ అంబర్ హెరిటేజ్ సంస్థ.. ఆనంద్ హోటల్స్‌గా పేరు మార్చుకుంది. ఈ ఆనంద్ హోటల్స్ సంస్థ ప్రమోటర్స్ ఎవరో కాదు.. మోదీ, ఆయన భార్య మినాల్. ఈ అంశంతో పలు ఇతర అవినీతి ఆరోపణలూ రావడం రాజే ప్రతిష్టను దిగజార్చింది.
2008 అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అంశంగా ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ లలిత్‌ను పవర్ బ్రోకర్‌గా అభివర్ణించింది. ఆ ఎన్నికల్లో రాజే ఓడిపోయారు. మోదీ వర్సెస్ రాజే.. ఆ తర్వాతా లలిత్, రాజేల మధ్య.. వారి కుటుంబాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఐపీఎల్ అవకతవకలు బయటపడ్డాక 2013 సెప్టెంబర్‌లో బీసీసీఐ లలిత్‌పై జీవితకాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోని రాజే(2013 ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు) 2014 మేలో లలిత్ ఆర్‌సీఏ అధ్యక్షుడయ్యేలా చూశారు. దాంతో ఆగ్రహించిన బీసీసీఐ ఆర్‌సీఏను సస్పెండ్ చేసింది.
దేశవాళీ పోటీల్లో రాజస్తాన్ క్రికెటర్లపై నిషేధం విధించింది. ఆ క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు వారికి మళ్లీ ఆడే అవకాశం కల్పించారు. ఆ తరువాతే, ఆర్‌సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ నేతృత్వంలోని మోదీ వ్యతిరేక బృందం రాజేకు దగ్గరైంది. 2014, అక్టోబర్లో రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి లలిత్ తొలగింపుతో లలిత్, రాజేల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. లలిత్ స్థానంలో బీజేపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్, లలిత్‌కు ఒకప్పటి అనుచరుడు అమిన్ పఠాన్ ఆర్‌సీఏ అధ్యక్షుడు కావడం వెనుక రాజే హస్తం ఉందని లలిత్ భావించాడు.
ఆ నియామకాన్ని లలిత్ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో ఆర్‌సీఏ జనరల్ బాడీ సమావేశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ తొలగించారు. దీనిపై లలిత్ గ్రహం ఆయన ట్వీట్స్‌లో కనిపించింది. ‘నా దగ్గర చాలా మిస్సైల్స్ ఉన్నాయి, జాగ్రత్త’ అని రాజేను ఉద్దేశించి హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు. తర్వాత తన పీఆర్ బృందం ద్వారా.. 2010లో తన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్‌కు రాజే సహకరించడానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను మీడియాకు విడుదల చేశాడు. తర్వాత పలు ట్వీట్ల ద్వారా, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా రాజేను ‘మోదీగేట్’లో భాగం చేశాడు. లలిత్, రాజేల విభేదాలు తీవ్రం కావడానికి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఒక కారణమన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.