వసుంధర రాజే x సచిన్
‘‘ఆమెకేం మహారాణి. రాజ కుటుంబీకుల వంశం నుంచి వచ్చారు. అందుకే అంత ఆధిపత్య ధోరణి. పరిపాలనలోనూ నియంతృత్వ పోకడలు. ఎవరికీ అందుబాటులో ఉండరు. ప్రజా సమస్యలు అసలే పట్టవు’’ ఇవీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజెపై వినిపిస్తున్న విమర్శలు. ఆమె ఒంటెత్తు పోకడలు, పార్టీ నేతలకూ అందుబాటులో ఉండకపోవడం, ఎవరినీ లెక్క చేయకపోవడం వంటివి వసుంధరా రాజె పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతను పెంచా యి. వచ్చే ఎన్నికల్లో ఆమె సీఎం కాకూడదని ఏకంగా 48% మంది కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. సొంత పార్టీలోనూ ఆమె వ్యవహార శైలి మింగుడుపడనివారు సీఎం అభ్యర్థిని మార్చాలంటూ స్వరం పెంచారు. కానీ బీజేపీ అధిష్టానం ఆ సాహసం చేయలేకపోయింది. దానికీ కొన్ని కారణాలున్నాయి.
రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో వసుంధరా రాజెకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కుల సమీకరణలతో రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. 120 మంది వరకు ఎమ్మెల్యేలు ఆమె కనుసన్నల్లోనే ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా శత్రువులు ఉన్నప్పటికీ వారిలో చీలికలు తేవడంలో ఆమెకు ఆమే సాటని నిరూపించుకున్నారు. అందుకే తనకు ఎదురైన రాజకీయ సంక్షోభాల నుంచి చాలా తేలిగ్గా బయటపడ్డారు. దీంతోపాటు ప్రజల్లో కాస్తో కూస్తో చరిష్మా కలిగిన నేతలు బీజేపీకి కరువయ్యారు. ఓం మాథుర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ఉన్నప్పటికీ వారు అందరికీ ఆమోదయోగ్యమైన నేతలు కారు. ఆరెస్సెస్ ఆశీస్సులు కూడా ఆమెకే ఉండడంతో బీజేపీ అధిష్టానానికి మరో మార్గం లేకపోయింది.
ఎన్నికల వ్యూహాలు
‘‘నేను రాజ్పుట్ల కూతురిని, జాట్ల కోడలని, గుజ్జార్ల వియ్యపురాలిని’’ ఇదీ ఎన్నికల సభల్లో వసుంధరా రాజె సాగిస్తున్న ప్రచారం. తన కోడలు నిహారికా సింగ్.. గుజ్జార్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని కులాల వారికి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుని చ్చిన రాజ్పుట్లు, గుజ్జార్లు దూరమవడంతో ఆమె ప్రతిచోటా భావోద్వేగాలతోనే వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 40 రోజుల పాటు సాగే రాజస్థాన్ గౌరవ యాత్ర ప్రారంభించి గ్రామ గ్రామానికి వెళుతున్నారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా భావిస్తూ వాటి గురించే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను మించి పార్టీలో కేడర్ వ్యతిరేకతే కలవరపెడుతూ ఉండడంతో జనసంవాద్ పేరుతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జాట్లకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగా కీలకమైన ప్రభుత్వ పదవుల్లో జాట్ అధికారుల్ని నియమించారు. హిందూ కార్డుని బయటకు తీసి ముస్లిం పేర్లుగా ధ్వనిస్తున్న గ్రామాల పేర్లకి హిందూ పేర్లు పెడుతున్నారు.
వ్యక్తిగత జీవితం
మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌కు చెందిన రాజమాత విజయరాజె సింధియా, జివాజీరావు సింధి యా దంపతుల నాలుగో సంతానమే వసుంధరా రాజె. ముంబైలో 1953, మార్చి 8న జన్మించారు. సోఫియా కాలేజీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు. 1972లో ధోల్పూర్కు చెందిన హేమంత్సింగ్ను వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత విభేదాలతో భర్త నుంచి విడిపోయారు. వారికి దుష్యంత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.
అభిరుచులు..
వసుంధరా రాజె పుస్తకాల పురుగు. చిన్నతనం నుంచి పుస్తకం కనిపిస్తే చాలు ఆసాంతం చదివేదాకా నిద్రపోయేవారు కాదు. ఇప్పటికీ రాత్రి పడుకునే ముందు కాసేపు పుస్తకం చదువుతారు. ఆమె అభిమాన రచయిత్రి హిలరీ మాంటెల్. వందల పుస్తకాలు ఆమె లైబ్రరీలో ఉన్నాయి. పెంపుడు జంతువులన్నా ఆమెకు వల్లమాలిన ప్రేమ. కుక్కల్ని పెంచుతారు. గుర్రాలంటే కూడా ఎంతో ఇష్టం. క్రీడలకి ఆమె పెద్ద ఫ్యాన్. అన్ని రకాల ఆటల్ని ఫాలో అవుతారు. క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. టీమిండియా గెలిచిన ప్రతీసారి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు పెడతారు. మొక్కల పెంపకం కూడా రాజెకి ఎంతో ఇష్టమైన అంశం. ఖాళీ సమయం దొరికితే పెరటి తోటలో చెట్ల మధ్యే గడుపుతారు.
రాజకీయ ప్రస్థానం
తల్లి విజయరాజె ప్రోద్బలంతోనే 1984లో రాజె రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీ తీర్థం తీసుకున్న రెండేళ్లలోనే బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ధోల్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర విదేశాంగ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 2003 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో పరివర్తన యాత్ర చేపట్టి ప్రజలకి దగ్గరయ్యారు. ఆమె నేతృత్వంలో 120 సీట్లతో పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2008 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజె ప్రాభవాన్ని కోల్పోలేదు. మంచి పరిపాలనా దక్షురాలిగా పేరు తెచ్చుకున్న వసుంధరా రాజె ఈసారి మాత్రం ఎవరికీ అందుబాటులో ఉండక చేజేతులారా తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్నారు.
‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’’ ఇదీ కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ విధానం. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్.. పార్టీ పటిష్టతలో తనదైన పాత్ర పోషించారు. ఒకప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగడానికి కూడా భయపడే నియోజకవర్గాల్లో.. గెలుపు మాదే అన్న ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పారు. పార్టీ కార్యకర్తలతో నిరంతరం టచ్‌లో ఉంటూ వారు చురుగ్గా పనిచేసేలా చర్యలు చేపట్టారు. గత ఫిబ్రవరి ఉపఎన్నికల సమయంలో గ్రామగ్రామాన పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్నారు. అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలు, మండల్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కీలక పాత్ర పోషించారు. దీంతో సచిన్ సీఎం అభ్యర్థి రేసులో ముందుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ సమయంలో నూ, పెట్రో ధరలు పెరిగేటప్పుడు జరిగే నిరసనల్లో నూ ముందుండి విజయవంతంగా నడిపించారు.
అనుకూల అంశాలు
- ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు
- కుల సమీకరణలకి అనుగుణంగా రాజకీయ వ్యూహరచన
- భామాషా ఆరోగ్య బీమా పథకం, రాజశ్రీ యోజన వంటి పథకాలతో మహిళల నుంచి మద్దతు
ప్రతికూల అంశాలు
- ఎవరికీ అందుబాటులో ఉండరన్న చెడ్డపేరు
- నియంతృత్వ పోకడలు
- రాజ్పుట్లు, గుజ్జార్లు వంటి బలమైన సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం
ఎన్నికల వ్యూహాలు..
ఎన్నికల ప్రచారం అంటే మాటలు కోటలు దాటేస్తాయి. తిట్లు, శాపనార్థాలు చివరికి బూతులు కూడా మన నేతలు మాట్లాడడం సర్వసాధారణమై పోయింది. సచిన్ దీనికి భిన్నం. పాజిటివ్ క్యాంపెయిన్ ఆయన విధానం. మంచి మాటకారి. ఏ అంశం మీదనైనా ధారాళంగా, స్పష్టంగా మాట్లాడతారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా విడమరిచి చెబుతూనే, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా మేనిఫెస్టోలు రూపకల్పన చేస్తూ ప్రజాసమస్యలే ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం గురించి ఎన్నికల ర్యాలీల్లో ప్రస్తావిస్తున్నారు. ఈసారి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 65 లక్షలకుపైగా ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. గుజ్జార్ సామాజిక వర్గానికి చెందిన పైలెట్ వారి ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు తిరిగి మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న రాజ్పుట్లను తనవైపు తిప్పుకుంటున్నారు. అయితే జనాకర్షణ అంశంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. వివిధ సంస్థల సర్వేల్లో 11% మంది మాత్రమే సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడైంది.
రాజకీయ ప్రస్థానం..
కాంగ్రెస్ దివంగత నాయకుడు రాజేష్ పైలెట్ కుమారుడు సచిన్ పైలెట్. ఉత్తరప్రదేశ్‌లో సహరణ్‌పూర్‌లో 1977 సెప్టెంబర్ 7న జన్మించారు. డబుల్ ఎంబీఏ చేశారు. ఒక కోర్సు అమెరికాలో చదివారు. 2004లో రాజస్థాన్ అజ్మీర్ నుంచి లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. దేశంలోనే అతి పిన్న వయసులో అంటే 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009లోనూ విజయం సాధించారు. యూపీఏ–2లో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. గ్రామీణాభివృద్ధిపై పైలెట్‌కు ఆసక్తి ఎక్కువ.
వ్యక్తిగత జీవితం..
రాజకీయాల్లోకి రాక ముందు బీబీసీ ఢిల్లీ బ్యూరో లో జర్నలిస్టుగా సేవలందించారు. ఆ తర్వాత జన రల్ మోటార్స్‌లో కూడా çకొంతకాలం పనిచేశారు. అమెరికాలో చదువుకునే సమయంలోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లాతో ప్రేమలో పడ్డారు. అయితే వారి వివా హానికి ఫరూక్, ఒమర్ అంగీకరించలేదు. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగానే వాళ్లు 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరన్, వెహాన్.. ఇద్దరు కుమారులు. తర్వాత కాలంలో అబ్దుల్లా కుటుంబం పైలెట్‌తో రాజీకొచ్చింది. తన తండ్రి రాజేశ్ పైలెట్ కోరిక మేరకు కేంద్ర మంత్రి అయ్యాక సరిహద్దు రక్షక దళంలో చేరారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడానికి సిటిజెన్ అలయెన్స్‌ను ఏర్పాటు చేశారు. తన తండ్రి స్మృతిలో ‘రాజేశ్ పైలెట్: ఇన్ స్పిరిట్ ఫరెవర్’ అనే పుస్తకాన్ని సోదరి సారికా పైలెట్‌తో కలిసి రచించారు.
అశోక్ గెహ్లాట్
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మరో నాయకుడు అశోక్ గెహ్లాట్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. 1998 నుంచి 2003 వరకు, తిరిగి 2008 నుంచి 2013 వరకు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. పరిపాలనలోనూ తనదైన ముద్ర వేశారు క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. ప్రజలకి అందుబాటులో ఉంటారని పేరు సంపాదించారు. 2013 ఎన్నికల సమయానికే మోదీ వేవ్‌లో రాజస్థాన్‌లో బీజేపీ నెగ్గింది తప్ప గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ఇప్పటికీ 35% మంది ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారని సర్వేల్లో తేలింది. రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన, హిందూత్వ కార్డు తీయడం వెనుక వ్యూహకర్త గెహ్లాటే. లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాలు రచించడానికి గెహ్లాట్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే పైలెట్‌నే ముందుంచి అసెంబ్లీ ఎన్నికల్ని నడిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో గెహ్లాట్‌తో పాటు సీపీ జోషి పేరు కూడా వినిపిస్తోంది కానీ పార్టీ గెలిస్తే ఆయన్ను సీఎంని చేసే అవకాశాలు చాలా తక్కువ. అయితే ప్రచారంలోనూ, టికెట్ల పంపిణీలోనూ జోషికి కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్