అవును.. ఆ సంతకం నాదే: వసుంధర రాజె
మోదీ గేట్ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కొంత మేర ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుకు మద్దతుగా బయటపడిన డాక్యుమెంట్లో సంతకం తనదేనని ఆమె తన పార్టీ అగ్రనేతల వద్ద అంగీకరించినట్లు తాజాగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆమెతో రాజీనామా చేయించే ఆలోచనలో మాత్రం బీజేపీ వర్గాలు కనిపించడంలేదు. ఆ లేఖను తాను వ్యక్తిగత హోదాలో ఇచ్చాను తప్ప.. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కాదని చెప్పేలా చూస్తున్నారని సమాచారం.
లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తును ఆమోదించాలంటూ వసుంధర రాజె ఒక పత్రం మీద సంతకం చేశారని.. నాలుగేళ్ల క్రితం నాటి ఆ పత్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ బుధవారం రాత్రి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఏడు పేజీల ఆ డాక్యుమెంటును పార్టీ అగ్రనేతలు క్షుణ్ణంగా పరిశీలించారని, రాజెతో వాళ్లు టచ్లోనే ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ కుంభకోణం బయటపడిన తర్వాత విచారణ నుంచి తప్పించుకునేందుకు లలిత్ మోదీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు వీసా ఇప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారని, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె కూడా మద్దతుగా నిలిచారంటూ కాంగ్రెస్ 'మోదీగేట్' కుంభకోణాన్ని ప్రస్తావిస్తోంది. సుష్మ భర్త, కుమార్తె కూడా లలిత్ మోదీ తరఫున న్యాయవాదులుగా వ్యవహరించారు.