'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'
తాను లండన్లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. లలిత్ మోదీ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందించారు. రాబర్ట్ వాద్రా, ప్రియాంకా గాంధీ ఇద్దరూ ప్రభుత్వంలో భాగం కారని, అందువల్ల వాళ్లు లలిత్ మోదీని కలిసినా తప్పు లేదని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు.
అయినా వాళ్లు లలిత్ మోదీని కలవడం పెద్ద నేరమేమీ కాదుగా అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ''ప్రియాంకా గాంధీ ఏదైనా అధికారిక పదవిలో ఉన్నారా.. ఆమె ఎవరికోసమైనా రికమండ్ చేశారా.. ఆమె ఎందుకు తప్పు చేసినట్లవుతుంది?'' అంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. కాగితాల మీద లలిత్ మోదీకి సాయం చేసినవాళ్లు ఇప్పుడు ప్రియాంక, రాబర్ట్ వాద్రాలను తమ రక్షణ కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.