ప్రధాని స్పందించాల్సిన అవసరం ఏముంది?
న్యూఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన ముద్ర దాల్చుతున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ మండిపడ్డారు. అసలు ప్రధానికి ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వచ్చే ప్రతీ ఆరోపణపై ప్రధాని స్పందించాలిన కోరడం భావ్యం కాదన్నారు.
లలిత్ మోదీ అంశంపై ప్రధానిని ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ వీకే సింగ్ ప్రశ్నించారు. అలా చేయడం సరైన పనేనా అంటూ కాంగ్రెస్ ను నిలదీశారు. ఒకవేళ ప్రధాని మాట్లాడాల్సి వస్తే దానికి తగిన సమయంలో తప్పకుండా స్పందిస్తారన్నారు. ఒక న్యూస్ ఛానల్ ఏదో ప్రసారం చేస్తే.. దానికి కూడా ప్రధాని స్పందించాలని అడగడం సరైన పద్ధతి అనిపించుకుంటుందా? అని విమర్శలను తిప్పికొట్టే యత్నం చేశారు.