న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించింది. వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభిస్తూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసును వ్యతిరేకిస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో అనర్హత చర్యల విషయంలో జూలై 24 వరకు స్పీకర్‌ను నిరోధిస్తూ రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది.
దీన్ని సవాలు చేస్తూ స్పీకర్ సి.పి.జోషి సుప్రీంకోర్టులో బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 19 మంది ఎమ్మెల్యేల వినతిపై తదుపరి ఉత్తర్వు ఇవ్వడానికి రాజస్తాన్ హైకోర్టుకు అనుమతి మంజూరు చేసింది.
అయితే, ఈ ఉత్తర్వు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తర్వు ఇవ్వకుండా హైకోర్టును తాము అడ్డుకోలేమని వెల్లడించింది. అంతేకాకుండా అనర్హత వేటు విషయంలో తనను నిరోధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న స్పీకర్ వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది.
అసమ్మతి గొంతు నొక్కేయలేం
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం చట్ట సభల సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని స్పీకర్ సి.పి.జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. స్పీకర్ ముఖ్యమైన ప్రశ్నలను లెవనెత్తారని, దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉందని తేల్చిచెప్పింది.
స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, వారు సొంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై ధర్మాసనం బదులిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి స్వరాన్ని నొక్కేయలేమని వ్యాఖ్యానించింది. స్పీకర్ పిటిషన్‌పై విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 19 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌పై రాజస్తాన్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేయనుంది.
షెకావత్‌పై విచారణ జరపండి
సంజీవని క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరపాలని జైపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టు రాజస్తాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సొసైటీలో వేలాది మంది సొమ్ము మదుపు చేశారు. సొసైటీ నిర్వాహకులు ఇందులో రూ.900 కోట్లను మింగేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ కుంభకోణంపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) దర్యాప్తు చేస్తోంది. 2019 ఆగస్టు 23న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఇందులో షెకావత్ పేరును చేర్చలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గులామ్‌సింగ్, లాబూ సింగ్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. సహకార సొసైటీ కుంభకోణంలో పాత్రదారులైన కేంద్ర మంత్రిని, మరికొందరిని ఎస్‌ఓజీ ఉద్దేశపూర్వకంగానే రక్షిస్తోందని ఫిర్యాదుదారులుఆరోపిస్తున్నారు.
టేపులను విదేశాలకు పంపిస్తాం: గహ్లోత్
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కుట్ర పన్నారని సీఎం గహ్లోత్ మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఆయన మాట్లాడినట్టుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు ముమ్మాటికీ నిజమైనవేనని ఉద్ఘాటించారు. ఫోరెన్సిక్ టెస్టు కోసం వాటిని విదేశాల్లోని సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు.
షెకావత్ ఏ తప్పూ చేయకపోతే స్వర నమూనా ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వానికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సచిన్ పైలట్ వర్గం కోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందిస్తూ.. వారంతా కోర్టుకు వెళ్లి తప్పు చేశారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో న్యాయస్థానానికి సంబంధం లేదని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment