లవ్‌ జిహాద్‌ : కోర్టు సంచలన తీర్పు | We Dont See Religion In Marriage Allahabad High Out | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌ : కోర్టు సంచలన తీర్పు

Nov 24 2020 1:11 PM | Updated on Nov 24 2020 1:31 PM

We Dont See Religion In Marriage Allahabad High Out - Sakshi

లక్నో : వివాదాస్పద లవ్‌ జిహాద్‌ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందు వర్గానికి చెందిన యువతి, ముస్లిం మతానికి చెందిన యువకుడి చేసుకున్న వివాహం చట్టబద్ధమైనదిగా పేర్కొంది. దేశ పౌరులకు రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కులకు లోబడే వారిద్దరూ వివాహం చేసుకున్నారని స్పష్టం చేసింది. తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి బలవంతపు మతమార్పిడి ద్వారా వివాహం చేసుకున్నారని యువతి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది.

పూర్తి వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక కర్వార్‌ (హిందు), సలామత్‌ అన్సారీ (ముస్లిం) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడి అభ్యర్థన మేరకు పెళ్లికి ముందు ప్రియాంక మత మార్పిడి చేసుకున్నారు. తన పేరును  ఆలియాగా మార్చుకున్నారు. అయితే వీరిద్దరి వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యువతి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయించి, ముస్లిం మతంలోకి మార్చి వివాహం చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మైనరైన తమ కుమార్తెను మోసగించి చేసుకున్న వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా వరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  దీనిపై సుమారు ఏడాది పాటు విచారణ జరిపిన వివేక్‌ అగర్వాల్‌, పంకజ్‌ నఖ్వీల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నాడు తుది తీర్పును వెలువరించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘యువతీ, యువకులను తాము మత ప్రతిపాదకన చూడటంలేదు.  ప్రియాంక హిందు, అన్సారీ ముస్లిం అయినప్పటికీ వారి వివాహాన్ని మత కోణంలో విభజించలేం. కులం, మతం, వర్గంతో సంబంధంలేకుండా ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే హక్కు పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించింది. యువతి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నా అని చెబుతోంది. దీనిలో ఎలాంటి బలవంతం లేదని కోర్టు విశ్వసిస్తోంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. వివాహం సమయంలో యువతి వయసు 20 ఏళ్లు. తన విచక్షణ మేరకే మతమార్పిడి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. వీరి వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది’ అంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. యువతి తల్లీదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఏడాది కాలంగా దంపతులిద్దరూ సుఖ,సంతోషాలతో గడుపుతున్నారని వారి జీవితంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. 

కాగా లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. హిందు యువతులను ముస్లిం వ్యక్తులను వివాహం చేసుకోవడాన్ని నేరంగా పరిగణించే చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నట్లు ఇ‍ప్పటికే పలువురు సీఎంలు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, అస్సోం, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు ఈ మేరకు చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే అలహాబాద్‌ హైకోర్టు తీర్పు రావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement