భోపాల్: లవ్ జిహాద్ ప్రస్తుతం ఈ పదం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన సంగతి తెలసిందే. తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరనుంది. లవ్ జిహాద్ పేరిట మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తాం అంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. మత మార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా రాష్ట్రం ముసాయిదా బిల్లును రూపొందించిన కొన్ని రోజులకే ఈ హెచ్చరిక వెలువడటం గమనార్హం. ఇక పెళ్లి పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతుల మతం మార్చే ఈ ప్రక్రియ పట్ల దేశవ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని కొందరు వాదిస్తుండగా.. ఈ తరహా పెళ్లిల్లు ప్రేమ వివాహాలు కదా.. మరి మతం మార్చుకోవడం ఎందుకు. ప్రేమకు అడ్డురాని మతం పెళ్లికి ఎలా అడ్డంకిగా మారుతుంది.. అమ్మాయే మతం మారాలా.. అబ్బాయి కన్వర్ట్ అయితే ఏం అవుతుంది అంటూ ప్రశ్నలు లేవనేత్తేవారు మరికొందరు. ఈ చర్చ ఎలా ఉన్నప్పటికి వివాహం పేరుతో మతం మారడానికి వీలు లేదంటున్నాయి పలు రాష్ట్రాలు. (చదవండి: ఆడ పిల్లల జీవితాలతో ఆటలు మానండి)
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాహం పేరిట మత బలవంతపు మతమార్పిడికి పాల్పడివారికి పదేళ్ల జైలు శిక్ష విధించేంలా ముసాయిదా బిల్లును రూపొందించింది. అయితే దీని మీద రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అసమ్మతి, అసహనం, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీంఎ శివరాజ్ సింగ్ వీటిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా లవ్ జిహాద్ పేరిటి మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడితే.. నాశనం చేస్తాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతి ఒక్కరిది.. అన్ని మతాలు, కులాలకు చెందినది. ఓ మతం, కులం, ప్రాంతం పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపదు. కానీ మా కూతుళ్లుతో ఎవరైనా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే.. ఊరుకోం. లవ్ జిహాద్ పేరిట ఎవరైనా మత మార్పిడి వంటి కుట్రలకు ప్లాన్ చేస్తే వారిని నాశనం చేస్తాం’ అంటూ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. (హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించండి: ఎంపీ)
ధర్మ స్వాంత్రాత బిల్లు 2020 ముసాయిదా చట్టం ప్రకారం వివాహం కోసం స్వచ్ఛందగా మతం మారాలని భావిస్తున్న వారు నెల రోజులు ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ తరహా కేసుల్లో సంరక్షకులు ఫిర్యాదు చేయవచ్చు.. ఇలాంటి వివాహాలను సులభతరం చేసే వారిని నిందితుడిగా పరిగణించడమే కాక జరిమానా విధిస్తారు. ఈ తరహా కార్యక్రమాలను ప్రొత్సాహించే సంస్థల నమోదును రద్దు చేస్తారు అని పేర్కొంది. ఇక ఇప్పటికే యూపీ లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిళ్లను నియంత్రించడం కోసం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment