నేతల 'ప్రేమ యుద్ధం'
పొలిటికల్ లీడర్స్ ప్రేమ యుద్ధం చేస్తున్నారు. పరస్పరం ప్రేమ ఎక్కువైపోయి ప్రేమ యుద్ధం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేతాశ్రీ అందరూ విసురుకుంటున్నది ప్రేమాస్త్రాలు కాదు 'లవ్ జిహాద్'పై ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రేమ యుద్ధం ఇప్పుడు దేశమంతటా పాకింది. అన్ని పార్టీల నాయకులు 'లవ్ వార్' లోకి దూకారు.
సమాజ్వాది పార్టీ ప్రభుత్వమే 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తోందని కమలనాథులు కయ్యిమనడంతో జగడం మొదలయింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని యోగి ఆదిత్యనాథ్ లాంటి కాషాయ నేతలు ఆరోపించడంతో వివాదం రేగింది. ఇక అక్కడి నుంచి మీరంటే మీరంటూ ఏలుబడిదారులు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సమాజ్వాది పార్టీ వివాదస్పద నాయకుడు అజంఖాన్ ఈ గోదాలోకి దూకారు.
లవ్ జిహాద్ కు అర్థం చెప్పాలంటే కాషాయ నేతలను ప్రశ్నించారు. బీజేపీ పార్టీలో ఉన్న చాలా మంది మైనారిటీ నాయకులు హిందూ మహిళలను పెళ్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అగ్రనేతలు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షాహనాజ్ హు్స్సేన్ సతీమణులు హిందూ మతానికి చెందిన వారని తెలిపారు. లవ్ జిహాద్ అర్థం ఏమిటో నఖ్వీ, హుస్సేన్ చెబితే బాగుంటుందన్నారు. లవ్, జిహాద్- ఈ రెండు పదాలు పవిత్రమైనవని చెప్పారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన వారు పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తే తప్పేంలేదని ఉద్ఘాటించారు.
అయితే షాహనాజ్ హుస్సేన్ భార్య రేణు, నఖ్వీ సతీమణి సీమలకు రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. వీరిద్దరూ గృహిణులు. ప్రేమ యుద్ధం ఇప్పుడూ పొలిటికల్ ఫ్యామిలీలకు పాకింది. ఇంకా ఎంతదాకా పోతుందో?