అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ Azam Khan Will Take 20 Minutes While Whole Team: Hafeez Shocking Comments. Sakshi
Sakshi News home page

అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Jun 14 2024 10:40 AM | Last Updated on Fri, Jun 14 2024 11:11 AM

Azam Khan Will Take 20 Minutes While Whole Team: Hafeez Shocking Comments

పాకిస్తాన్‌ యువ క్రికెటర్‌ ఆజం ఖాన్‌ను ఉద్దేశించి మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌ సంచనల వ్యాఖ్యలు చేశాడు. అతడికి ఫిట్‌నెస్‌పై ఏమాత్రం ఆసక్తి లేదని.. ఆజం ఖాన్‌ను మార్చాలని తాము చేసిన ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నాడు.

లావుగా ఉండటం సమస్య కాదని.. కానీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ లేకపోవడమే అసలైన సమస్య అని ఆజం ఖాన్‌ను హఫీజ్‌ ఘాటుగా విమర్శించాడు. కాగా పాక్‌ మాజీ కెప్టెన్‌ మెయిన్‌ ఖాన్‌ కుమారుడైన ఆజం ఖాన్‌ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

పూర్తిగా విఫలం
కుడిచేతి వాటం కలిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు అడపాదడపా పాక్‌ జట్టులో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్‌-2024 సన్నాహకాల్లో భాగంగా.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడే ఛాన్స్‌ ఇచ్చినప్పటికీ పూర్తిగా విఫలమయ్యాడు.

రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 11 పరుగులే చేయడంతో పాటు.. వికెట్‌ కీపర్‌గానూ కీలక సమయంలో క్యాచ్‌లు మిస్‌ చేసి పాక్‌ పరాజయాలకు పరోక్ష కారకుడయ్యాడు. ఫలితంగా ఆజం ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగి 
అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌ టీ20 ప్రపంచకప్‌-2024లో పాకిస్తాన్‌ ఆరంభ మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు కల్పించింది. అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆజం ఖాన్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లలో అతడిని పక్కనపెట్టింది యాజమాన్యం.

 లావుగా ఉండటం సమస్య కాదు
ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్‌, పాక్‌ జట్టు మాజీ డైరెక్టర్‌ హఫీజ్‌ ఖాన్‌ ఆజం ఖాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులోని ఆటగాళ్లంతా పది నిమిషాల్లో రెండు కిలోమీటర్లు నడిస్తే.. ఆజం ఖాన్‌ మాత్రం అందుకోసం 20 నిమిషాల సమయం తీసుకుంటాడు.

నిజానికి అతడు అంతర్జాతీయ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం విషాదకరం. సన్నగా.. లేదంటే లావుగా ఉండటం అనేది నా దృష్టిలో అసలు సమస్యే కాదు.

అయితే, ఆటకు తగ్గట్లుగా మన శరీరాన్ని మలచుకోవడం ముఖ్యం. నిర్దేశిత ఫిట్‌నెస్‌ లెవల్స్‌ సాధించాల్సి ఉంటుంది. గతంలో మేము అతడికి ఫిట్‌నెస్‌ ప్లాన్‌ ఇచ్చాం.

టాలెంట్‌ ఉంటే సరిపోదు
కానీ ఆజం ఖాన్‌ ఏమాత్రం మెరుగుపడలేదు. టాలెంట్‌ ఉంది కాబట్టి జట్టులో అవకాశాలు రావచ్చు. అలాంటపుడు ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే మంచిది కదా.

జట్టులో అతడు తప్ప ఎవరూ ఫిట్‌నెస్‌ విషయంలో కాంప్రమైజ్‌ కారు’’ అంటూ ఆజం ఖాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మహ్మద్‌ హఫీజ్. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌-2024 టోర్నీలో పాకిస్తాన్‌ గ్రూప్‌ దశలోనే ఎలిమినేట్‌ కావడం దాదాపుగా ఖరారైపోయింది.‌ 

కాగా.. ఇప్పటిదాకా పాక్‌ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన ఆజం ఖాన్‌..  135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు.

చదవండి: T20 WC AFG Vs PNG: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్‌.. న్యూజిలాండ్‌ ఎలిమినేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement