T20 WC 2024: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌! | T20 World Cup Pakistan To Face Elimination Due To Heavy Rains In Florida, Know More Details | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఫ్లోరిడాలో భారీ వర్షాలు.. పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌!

Published Thu, Jun 13 2024 1:48 PM | Last Updated on Thu, Jun 13 2024 2:47 PM

T20 WC Pakistan To Face Elimination Due To Heavy Rains In Florida How

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో ముందుకు సాగాలన్న పాకిస్తాన్‌ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. వర్షం దెబ్బకు కనీసం ఈసారి గ్రూప్‌ దశ దాటడం కూడా గగనమే కానుంది. కాగా టీమిండియాతో పాటు గ్రూప్‌-ఏలో భాగమైన బాబర్‌ ఆజం బృందం.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటే గెలిచింది.

తొలుత అమెరికా చేతిలో ఓడిన పాక్‌.. తర్వాత టీమిండియాతో ఉత్కంఠ మ్యాచ్‌లోనూ అపజయం పాలైంది. ఈ క్రమంలో కెనడాపై గెలుపొందిన పాకిస్తాన్‌.. సూపర్‌-8 చేరాలంటే అమెరికాతో పోటీ పడాల్సి ఉంది.

అమెరికా ఓడిపోతేనే
ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో అమెరికా గనుక ఓడితే పాక్‌కు అవకాశాలు ఉంటాయి. అయితే, జూన్‌ 14న జరిగే ఈ మ్యాచ్‌ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

లాడర్‌హిల్‌లోని సెంట్రల్‌ బొవార్డ్‌ రీజినల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌- అమెరికా మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, ఫ్లోరిడాలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు..  ఎమర్జెన్సీ ప్రకటన
ఈ క్రమంలో ఫోర్ట్‌ లాడర్‌డేల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వాన, వరద ఉధృతమయ్యే సూచనలు ఉన్నాయని.. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

శ్రీలంక పయనం వాయిదా
ఈ నేపథ్యంలో సౌత్‌ ఫ్లోరిడా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో శ్రీలంక జట్టు వెస్టిండీస్‌ పయనం వాయిదా పడింది. గ్రూప్‌-డిలో ఉన్న లంక జట్టు ఇప్పటికే లాడర్‌హిల్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ రద్దైన కారణంగా సూపర్‌-8 నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.

ఈ క్రమంలో తదుపరి నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ కోసం విండీస్‌ వెళ్లాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఇక్కడే నిలిచిపోయింది లంక జట్టు.  

పాక్‌కు ఊహించని షాక్‌
ఇదిలా ఉంటే.. శుక్రవారం ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా- ఐర్లాండ్‌ మ్యాచ్ గనుక వర్షం వల్ల రద్దైతే పాకిస్తాన్‌ అధికారికంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌ రద్దైతే ఒక పాయింట్‌ ఖాతాలో చేరితే.. మొత్తం ఐదు పాయింట్లు అవుతాయి. మరోవైపు.. పాక్‌ రెండు పాయింట్లతో ఉంది. అమెరికా- ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దైతే.. తదుపరి ఫ్లోరిడాలోనే జరగాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను పాక్‌ ఓడించినా ఫలితం ఉండదు. 

ఎందుకంటే.. అందులో గెలిచినా పాక్‌ ఖాతాలో ఉండేవి నాలుగు పాయింట్లే. కాబట్టి ఇప్పటికే సూపర్‌-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు సెకండ్‌ టాపర్‌గా అమెరికా బెర్తు ఖరారు చేసుకుంటుంది. ‌ 

చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement