Shahnawaz Hussain
-
షానవాజ్ హుస్సేన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు షానవాజ్ హుస్సే న్పై అత్యాచార ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఒక మహిళ హుస్సేన్ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడం వారిలో ఎంత అయిష్ట త ఉందో బహిర్గతమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ వ్యాఖ్యానించారు. గతంలో ట్రయల్ కోర్టు ఎఫ్ఐఆర్ ఆదేశాలు జారీ చేయ మంటూ తీర్పునివ్వడం సరైన చర్యేనని పేర్కొ న్నారు. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హుస్సేన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ షానవాజ్ హుస్సేన్ సుప్రీంకోర్టుకెక్కారు. సుప్రీంలోనూ ఆయనకు చుక్కెదురైంది. -
మంత్రులుగా 17 మంది ప్రమాణం
పాట్నా: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కొద్దిమందితో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా తాజాగా కొత్తగా 17 మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో వారితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పార్టీతో పాటు బీజేపీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిహార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంగళవారం జరిగింది. కొత్తగా 17 మంది మంత్రులుగా గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణం చేయించారు. కొత్తగా మంత్రులుగా నియమితులైన వారిలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి సహనవాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆయన గత నెలలో మండలికి ఎన్నికవడంతో ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా మంత్రులైన వారిలో జేడీయూ నేతలు సంజయ్ కుమార్ జా, శ్రావణ్ కుమార్, లేసి సింగ్, బీజేపీకి చెందిన మదన్ సాహని, ప్రమోద్ కుమార్ ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో 36 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు నితీశ్ బృందంలో 13 మంది మాత్రమే అక్కడ మంత్రులుగా ఉండగా తాజాగా 17 మంది నియమితులవడంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడింది. -
ఐఎస్ నుంచి బీజేపీ నేతకు బెదిరింపులు
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్టు బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ చెప్పారు. ఢిల్లీలోని తన నివాసానికి పోస్ట్ ద్వారా ఐఎస్ పేరుతో ఓ లేఖ వచ్చినట్టు తెలిపారు. షానవాజ్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉర్దు, ఇంగ్లీష్ భాషల్లో లేఖను టైప్ చేసినట్టు షానవాజ్ వెల్లడించారు. బీజేపీని, తనను లేఖలో దూషించారని చెప్పారు. ఇంతకుముందు కూడా సోషల్ మీడియా ద్వారా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. షానవాజ్ నుంచి ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరుపుతున్నామని డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. -
దంపతుల మధ్య ‘ఆమిర్’ చిచ్చు!
- భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య ముంబై/జబల్పూర్: అసహనంపై ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలు ఓ కుటుంబంలో చిచ్చురేపాయి! మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన అయాంక్ పాండే, సోనల్ పాండే దంపతుల మధ్య అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన చర్చ.. ముదిరి వ్యక్తిగతంగా తిట్టుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో మనోవేదనకు గురైన సోనల్ పక్క గది లోకి వెళ్లి లోపలినుంచి గడియ పెట్టుకుని విషం తాగిందని.. కాసేపటికి తలుపులు బద్దలు కొట్టి చూడగా సోనల్ అపస్మారక స్థితిలో పడి ఉందని అయాంక్ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చల్లారని దుమారం.. అసహనానికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. బీజేపీ నేత శతృఘ్నసిన్హా ఆమిర్ తనకు సన్నిహితుడని, అయితే దేశంలో అసహనం పెరుగుతోందంటూ అతను చేసిన వ్యాఖ్యలను మాత్రం తాను సమర్థించలేనని ట్విటర్లో పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. ఆమిర్‌ఖాన్ తన పూర్వీకులు నివసించిన అఖ్తియార్‌పూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజల మధ్య ప్రేమ, సామరస్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా రు. కాగా, ఆమిర్ తాను ఏం భావించాడో అదే చెప్పాడని, ప్రజాస్వామ్య దేశంలో తనకు నచ్చినది చెప్పే హక్కు అతనికి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంథామన్ ఆమిర్‌కు మద్దతుగా నిలిచారు. తన వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన విమర్శలపై ఆమిర్ స్పందించిన తీరును బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రశంసించారు. ఆమిర్‌పై రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమిర్‌ఖాన్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నా.. ఎప్పుడూ ఆయన దేశాన్ని విడిచి వెళ్లాలని భావించలేదన్నారు. తాను ఎదుర్కొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. -
'మన శాశ్వత సభ్యత్వానికి గండికొడుతున్నారు'
లక్నో: కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అసహనం అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుందని, దీని వల్ల దేశ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ లక్నోలో అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అనేక దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్నా, కాంగ్రెస్ రాజకీయ విధానాలు ఆ అవకాశాలకు గండి కొట్టేవిలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కంటే ఇప్పుడు దేశంలో అసహనం ఎక్కువగా ఉందా అని షానవాజ్ ప్రశ్నించారు. అసహనం అంశాన్ని పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని అసహన ఆరోపణలతో భంగపరచలేరని షానవాజ్ స్పష్టం చేశారు. -
ఆర్ యూ సీరియస్?
బెంగళూరు: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరాగమనంపై బీజేపీ నాయకుడు షాహనాజ్ హుస్సేన్ వ్యంగ్యంగా స్పందించారు. రాహుల్ త్వరలోనే తిరిగొస్తారని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఇదంతా నిజమేనంటారా(ఆర్ యూ సీరియస్) అంటూ ప్రశ్నించారు. సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ ఈ నెల 19న తిరిగొస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్ పునరాగమనంపై వస్తున్న వార్తల్లో నిజమెంతో తమకు తెలియదని షాహనాజ్ హుస్సేన్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధులెవ్వరూ ప్రకటన చేయలేదు. 'రాహుల్ ఏ విమానంలో వస్తారు. వచ్చిన తర్వాత ఎవరినీ కలుస్తారు. రాహుల్ సెలవు పూర్తైన తర్వాతే వీటికి జవాబు దొరకుతుంది' అని హుస్సేన్ అన్నారు. -
'సీఎం పీఠం కోసం తహతహలాడుతున్నాడు'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పీఠం కోసం బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ తహతహలాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. బుధవారం న్యూఢిల్లీలో షానవాజ్ మాట్లాడుతూ... నితీష్ అక్రమ మార్గంలో శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్లు హైకోర్టే తేల్చిందని తెలిపారు. నితీష్ వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో... లేదో తెలియదని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మద్దతు ఎవరికనేది అసెంబ్లీలోనే చెబుతామని షానవాజ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక చెల్లదని బుధవారం పాట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది. బీహార్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షభం విషయంలో గవర్నర్ మాత్రమే జోక్యం చేసుకోగలరని హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఇది మోదీ విజయం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం వైపు దూసుకుపోవడంపై ఆ పార్టీ స్పందించింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయమని బీజేపీ అభివర్ణించింది. మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా రుజువైందని ఆ పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ . శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఇరు రాష్ట్రాలలో బీజేపీ తొలిసారిగా అధికారాని చేపడతామని షానవాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
నేతల 'ప్రేమ యుద్ధం'
పొలిటికల్ లీడర్స్ ప్రేమ యుద్ధం చేస్తున్నారు. పరస్పరం ప్రేమ ఎక్కువైపోయి ప్రేమ యుద్ధం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేతాశ్రీ అందరూ విసురుకుంటున్నది ప్రేమాస్త్రాలు కాదు 'లవ్ జిహాద్'పై ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రేమ యుద్ధం ఇప్పుడు దేశమంతటా పాకింది. అన్ని పార్టీల నాయకులు 'లవ్ వార్' లోకి దూకారు. సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వమే 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తోందని కమలనాథులు కయ్యిమనడంతో జగడం మొదలయింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని యోగి ఆదిత్యనాథ్ లాంటి కాషాయ నేతలు ఆరోపించడంతో వివాదం రేగింది. ఇక అక్కడి నుంచి మీరంటే మీరంటూ ఏలుబడిదారులు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వివాదస్పద నాయకుడు అజంఖాన్ ఈ గోదాలోకి దూకారు. లవ్ జిహాద్ కు అర్థం చెప్పాలంటే కాషాయ నేతలను ప్రశ్నించారు. బీజేపీ పార్టీలో ఉన్న చాలా మంది మైనారిటీ నాయకులు హిందూ మహిళలను పెళ్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అగ్రనేతలు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షాహనాజ్ హు్స్సేన్ సతీమణులు హిందూ మతానికి చెందిన వారని తెలిపారు. లవ్ జిహాద్ అర్థం ఏమిటో నఖ్వీ, హుస్సేన్ చెబితే బాగుంటుందన్నారు. లవ్, జిహాద్- ఈ రెండు పదాలు పవిత్రమైనవని చెప్పారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన వారు పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తే తప్పేంలేదని ఉద్ఘాటించారు. అయితే షాహనాజ్ హుస్సేన్ భార్య రేణు, నఖ్వీ సతీమణి సీమలకు రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. వీరిద్దరూ గృహిణులు. ప్రేమ యుద్ధం ఇప్పుడూ పొలిటికల్ ఫ్యామిలీలకు పాకింది. ఇంకా ఎంతదాకా పోతుందో? -
'మోడీ ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు'
వారణాసి: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు. మోడీకి లక్షల సంఖ్యలో మెజారిటీ వస్తుందన్నారు. మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. కాశీలో రాహుల్ గాంధీ నేడు నిర్వహించిన రోడ్ షోకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని మరో బీజేపీ నేత షాహనాజ్ హుస్సేన్ ఎద్దవా చేశారు. రోడ్ షోకు వచ్చిన వారిలో ఏ మాత్రం ఉత్సాహం లేదన్నారు. నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారని చెప్పారు. -
ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీకి, జాతికి ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మోడీకి వ్యతిరేకంగా ఆమె చేసిన నీచ రాజనీతి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ నాయకులు సంయమనం కోల్పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. సోనియా గాంధీ కుటుంబం మొత్తం మోడీని లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలంతో దాడి చేస్తోందన్నారు. రాజకీయాలు క్లీన్‌గా ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మాత్రమే కాదని, ప్రజలు ఆయనను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. అలాంటి నాయకుడిపై నోరు జారిన ప్రియాంక క్షమాపణలు చెప్పాలని షానవాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. -
ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్టులో షానవాజ్ హుస్సేన్!
అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హిట్‌లిస్టులో బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ పేరు ఉంది!! ఈ విషయాన్ని బీహార్ పోలీసు అధికారులు మంగళవారం తెలిపారు. అగ్రస్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉండగా, ఆ తర్వాత హిట్ లిస్టులో ఉన్నది షానవాజ్ హుస్సేన్ పేరేనని అధికారులు అన్నారు. పాట్నాలో నరేంద్రమోడీ ర్యాలీకి ముందు జరిగిన వరుస పేలుళ్లలో ఆరుగురు మరణించగా దాదాపు 100 మంది గాయపడిన విషయం తెలిసిందే. భాగల్పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షానవాజ్ హుస్సేన్.. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తరచు బీహార్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఉగ్రవాద ముప్పు ఉందన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బీహార్ పోలీసులకు తెలిపింది. గత నెలలోనే ఈ మేరకు పాట్నా పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా ఓ లేఖ పంపిందని, ఆ లేఖ అందగానే బీహార్ పోలీసులు, నిఘా సంస్థలు దాన్ని సీరియస్‌గా తీసుకుని ఎలాంటి పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాయని పోలీసులు చెప్పారు. ఇటీవల నేపాల్‌లో రహస్యంగా సమావేశమైన ఇండియన్ ముజాహిదీన్ అగ్రనేతలు, భారతదేశంలోని బీజేపీ అగ్రనేతలు.. ముఖ్యంగా మోడీ, షానవాజ్ హుస్సేన్‌లను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. కొందరు బీజేపీ సీనియర్ నాయకులపై మావోయిస్టు దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని బీహార్ పోలీసు నిఘా విభాగం హెచ్చరించింది. -
కాశ్మీర్లో అరుణ్ జైట్లీ నిర్బంధం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో మత ఘర్షణలు జరిగిన కిష్ట్వార్ జిల్లాను సందర్శించేందుకు ఆదివారం జమ్మూ చేరుకున్న బీజేపీ నేత అరుణ్ జైట్లీని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వెనక్కు పంపింది. జమ్మూ విమానాశ్రయంలోనే పోలీసులు ఆయనను నిర్బంధించారు. తర్వాత కొద్దిసేపటికి ఆయనను వెనక్కు పంపారు. జైట్లీతో పాటు వచ్చిన పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ అవినాశ్‌రాయ్ ఖన్నాను, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జుగల్ కిశోర్‌ను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత వెనక్కు పంపారు. మత ఘర్షణలతో ఉద్రిక్తంగా మారిన కిష్ట్వార్ వెళ్లేందుకు రాజకీయ నాయకులను అనుమతించబోమని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కిష్ట్వార్లో ఆదివారం మరో మృతదేహం లభ్యమైంది. అయితే, మృతుడు హింసాకాండలోనే మరణించాడా, మరేదైనా కారణం వల్ల మరణించాడా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ సందర్భంగా వదంతులను నమ్మవద్దని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిష్ట్వార్లో శుక్రవారం చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందిన దరిమిలా, కాశ్మీర్ లోయలోని చుట్టుపక్కల ప్రాంతాలకూ ఉద్రిక్తతలు విస్తరించాయి. దీంతో శనివారం జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం, ఆదివారం ఉధామ్‌పూర్, సాంబా, కఠువా జిల్లాలకు, దోడా జిల్లాలోని భదేర్వా పట్టణానికి కర్ఫ్యూ విస్తరించింది. అయితే, జమ్మూ విమానాశ్రయంలోనే జైట్లీని నిర్బంధించి, అక్కడి నుంచి ఆయనను వెనక్కు పంపడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మత ఘర్షణలు చెలరేగిన ప్రాంతంలో వాస్తవాలను తెలుసుకునేందుకు వచ్చిన జైట్లీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడింది. కిష్ట్వార్ హింసాకాండకు సంబంధించిన నిజాలు బయటకు రాకుండా చూసేందుకే ఒమర్ సర్కారు జైట్లీ సహా తమ పార్టీ నేతలను నిర్బంధించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. కాగా, ఘర్షణలు జరిగిన కిష్ట్వార్ జిల్లాకు వెళ్లాలనుకున్న తనను శ్రీనగర్‌లోని తన ఇంటిని దాటి బయటకు రాకుండా నిర్బంధించారని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ రాజకీయ నాయకులందరూ తిరిగి 2008 నాటి (అమర్నాథ్ భూములపై ఘర్షణ) పరిస్థితులను పునరావృతం చేయాలని ప్రయత్నిస్తున్నారని, తద్వారా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్‌తో తాను ఫోన్లో మాట్లాడానని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నేతలకు సూచించాలని కోరానని ఒమర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో మూడు జిల్లాలకు కర్ఫ్యూ విధించామని, ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించామని జమ్మూ డివిజినల్ కమిషనర్ శాంత్మను చెప్పారు. మంత్రి పాత్రపై దర్యాప్తు జరపాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ కిష్ట్వార్ మత ఘర్షణలపై జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నరేశ్ గుప్తా డిమాండ్ చేశారు. కిష్ట్వార్లో మైనారిటీలపై జరిగిన దాడి వెనుక రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సజ్జద్ కిచ్లూ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని, కిచ్లూ కిష్ట్వార్లో ఉండగానే ఈ సంఘటన జరిగినందున ఆయన పాత్రపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.